ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్‌ను షేక్ చేసే సీక్రెట్ వెపన్ ఇదేనా?
ఇప్పుడు ఆయన విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాపై కూడా అదే తరహా ఆసక్తి కనిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్, కామెడీ కలగలిపిన కథనాలతో త్రివిక్రమ్ తనకంటూ ప్రత్యేక శైలిని నిర్మించుకున్నారు.
ఇప్పుడు ఆయన విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాపై కూడా అదే తరహా ఆసక్తి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా హైప్ లేకపోయినా, వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కారణంగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై సైలెంట్‌గా పాజిటివ్ చర్చ సాగుతోంది. వెంకటేష్ కెరీర్‌లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేయగా ఆ సినిమాలకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఆ సినిమాల సక్సెస్ కు కథ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఎంత కారణమో, ప్రేక్షకులతో ఏర్పడిన ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతే కీలకం. ఇదే నేపథ్యంలో త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్ అనగానే చాలామంది ప్రేక్షకులు మరో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఊహిస్తున్నారు. ముఖ్యంగా మాస్ యాక్షన్, పాన్ ఇండియా హంగామా ఎక్కువగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఒక స్వచ్ఛమైన కుటుంబ కథ వస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆదర్శ కుటుంబం ప్రస్తుతం అండర్ ది రాడార్‌లో ఉన్నా, సరైన కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే సామర్థ్యం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుత ఫామ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు అత్తారింటికి దారేది, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో కథ, సంభాషణలు, భావోద్వేగాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్, ఇటీవల కాలంలో అదే మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ నుంచి ఆఖరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ పొందకపోవడం ఈ డిస్కషన్స్ కు మరింత బలాన్ని చేకూర్చింది.
కథ, స్క్రీన్‌ప్లే నిర్మాణం, పాత్రల రూపకల్పనలో ఒకప్పుడు కనిపించిన తాజాదనం ఇప్పుడు తగ్గిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆదర్శ కుటుంబం సినిమాపై ఆసక్తి ఎంత ఉందో, త్రివిక్రమ్ నుంచి మరోసారి వింటేజ్ టచ్ కనిపిస్తుందా అనే ప్రశ్న కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. వెంకటేష్‌కు సరిపోయే బలమైన కథ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కదిలించే ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు ఈ సినిమాలో ఉంటే మాత్రం ప్రస్తుతం తక్కువగా కనిపిస్తున్న బజ్ ఒక్కసారిగా భారీ అంచనాలుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.