వరుణ్ తో ఎంగేజ్మెంట్ అందుకే క్యాన్సిల్ చేసుకున్నా - త్రిష
ప్రేమ, పెళ్లి కంటే తన వృత్తికే ప్రాధాన్యతనిస్తూ ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ విశేషాలు చూద్దాం..;
వెండితెరపై దశాబ్దాలుగా నటిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ నిర్మాత కుమారుడి రిసెప్షన్‌లో నటుడు విజయ్‌తో కలిసి ఆమె కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఈ గాసిప్స్ పక్కన పెడితే, త్రిష తన జీవితంలో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు ఆమెకు సినిమాపై ఉన్న అంకితభావాన్ని చాటిచెబుతున్నాయి. ప్రేమ, పెళ్లి కంటే తన వృత్తికే ప్రాధాన్యతనిస్తూ ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
పెళ్లి ఆగిపోయినా పర్లేదు.. సినిమానే ముఖ్యం:
త్రిష వ్యక్తిగత జీవితం గురించి చర్చ వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆమె గతంలో రద్దు చేసుకున్న నిశ్చితార్థం. 2015లో వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికీ, పెళ్లి పీటల దాకా వెళ్లకుండానే అది ఆగిపోయింది. దీనిపై ఒక ఇంటర్వ్యూలో త్రిష చాలా స్పష్టంగా మాట్లాడారు. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సినిమాలకు స్వస్తి చెప్పాలని కండిషన్ పెట్టాడని, అందుకే తాను ఆ పెళ్లి కంటే సినిమాలకే ఓటు వేశానని ధైర్యంగా చెప్పారు. "సినిమాలకు కాదు, నా ఎంగేజ్‌మెంట్‌కే ఫుల్ స్టాప్ పెట్టాను" అని ఆమె చెప్పిన మాటలు ఆమెలోని వృత్తి ప్రేమని చాటుతాయి.
విజయ్‌తో రిసెప్షన్‌కు రాక.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు:
ఇటీవల మార్చి 5న చెన్నైలో జరిగిన నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో త్రిష సందడి చేశారు. ఈ వేదికపైకి నటుడు విజయ్‌తో కలిసి ఆమె రావడం ఒక్కసారిగా అందరు ఆమె వైపు మాట్లాడేలా చేసింది. గతంలో వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల వస్తున్న రకరకాల వార్తల నేపథ్యంలో, త్రిష ఆయనతో కలిసి ఇలా ఒకే వేదికపై కనిపించడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీసింది. ఈ విజువల్స్ ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతూ, కొత్త ఊహాగానాలకు తావిస్తున్నాయి.
చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటా:
ఇక సాధారణంగా హీరోయిన్లకు కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుందని అంటుంటారు. కానీ త్రిష మాత్రం రెండు దశాబ్దాలుగా స్టార్‌గా వెలుగుతూ ఆ మాటను తప్పు అని నిరూపిస్తున్నారు. "నా చివరి శ్వాస వరకు నేను నటిస్తూనే ఉండాలన్నదే నా కోరిక" అని ఆమె చెప్పడం సినిమా పట్ల ఆమెకు ఉన్న అమితమైన ఇష్టాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని రూమర్లు వచ్చినా తన పనిపైనే దృష్టి పెట్టడం త్రిష స్టైల్. అందుకే ఆమె నేటి తరం నటీమణులకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తూ, తన కెరీర్‌ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక త్రిష అంటే కేవలం అందం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా అని ఆమె ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. తన ఇష్టాలను కాదని చెప్పే బంధాల కంటే, తనను తాను నిరూపించుకునే కెరీరే మిన్న అని ఆమె నిరూపించారు.