టాక్సిక్ టికెట్ హైక్‌లో.. ఈ కోటి లెక్క స్పెషల్

యశ్ ‘టాక్సిక్’ రిలీజ్‌కు ఇక కొన్ని గంటల సమయమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ చేశారు.

Update: 2026-08-25 17:23 GMT

యశ్ ‘టాక్సిక్’ రిలీజ్‌కు ఇక కొన్ని గంటల సమయమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే తెలంగాణలో టికెట్ రేట్ల క్లారిటీ కోసం చివరి వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేసింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లకు అదనపు ధరలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ఆర్డర్‌లో టికెట్ హైక్‌తో పాటు మరో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది.

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌కు ప్రస్తుతం ఉన్న ధరపై రూ.50 అదనంగా తీసుకోవచ్చు. మల్టీప్లెక్స్, స్పెషల్ థియేటర్లలో రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. జీఎస్టీతో కలిపే ఈ అదనపు ధరలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు అమల్లో ఉంటాయి. రోజుకు ఐదు రెగ్యులర్ షోలకు ఈ వెసులుబాటు ఇచ్చారు. అంటే తొలి పది రోజులు ‘టాక్సిక్’కు పెరిగిన ధరలతోనే టికెట్లు అందుబాటులో ఉంటాయి.

అయితే ఇక్కడ సినీ కార్మికులకు కూడా మంచి జరిగేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ‘టాక్సిక్’ నిర్మాణ సంస్థలు కేవీఎన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ రూ.1 కోటిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాలో తప్పనిసరిగా జమ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ఖాతాలోని డబ్బును సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ఉపయోగించనున్నారు. టికెట్ ధరల పెంపునకు అనుమతితో పాటు ఈ కండీషన్‌ను ప్రభుత్వం పెట్టింది.

యశ్‌కు తెలుగు మార్కెట్ కూడా చాలా కీలకం. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’తో ఇక్కడ భారీ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ హీరో నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’ను తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లలో తీసుకొస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇక ప్రభుత్వం మరో కండీషన్ కూడా పెట్టింది. ‘టాక్సిక్’ ప్రదర్శించే థియేటర్లలో డ్రగ్స్, నార్కోటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే ప్రకటనలు ప్రదర్శించాలి. ఈ నిబంధనలు అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సినిమా లైసెన్సింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

తెలంగాణతో టికెట్ రేట్ల లెక్క కూడా క్లియర్ కావడంతో ఇప్పుడు ఫోకస్ పూర్తిగా బుకింగ్స్‌పైకి వెళ్లనుంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాలు తొలి రోజు వసూళ్లలో కీలకంగా మారనున్నాయి. రిలీజ్‌కు ఒక్క రోజు ముందు హైక్ రావడంతో ‘టాక్సిక్’ ఎంత పెద్ద ఓపెనింగ్ తీసుకుంటుందన్నదే ఇక చూడాలి.

Tags:    

Similar News