భారీ సినిమాకు 3-4 ఏళ్లు.. మళ్లీ అదే చర్చ..
ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమా కోసం మూడు, నాలుగు సంవత్సరాలు కేటాయించడం కామన్ గా మారింది.
ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమా కోసం మూడు, నాలుగు సంవత్సరాలు కేటాయించడం కామన్ గా మారింది. పాన్ ఇండియా మార్కెట్, భారీ బడ్జెట్లు, విజువల్ ఎఫెక్ట్స్, పర్ఫెక్షన్ పేరుతో సినిమా నిర్మాణ కాలం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీలోని పలువురు సీనియర్లు కూడా ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఒక సినిమా ప్రారంభమైతే కొన్ని నెలల్లోనే షూటింగ్ పూర్తయ్యేది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా ముగించి విడుదల చేసేవారు. అందుకే హీరోలు ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసేవారు. నిర్మాతలకు పెట్టుబడులు త్వరగా తిరిగి వచ్చేవి. ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలను తరచూ సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ మొదలవ్వడానికే నెలలు పడుతోంది. షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, రీషూట్లు, పాన్ ఇండియా ప్రమోషన్లు వంటి కారణాలతో విడుదల మరింత ఆలస్యం అవుతోంది. దీంతో ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతోంది.
మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య పెరగడంతో నిర్మాతలపై ఆర్థిక భారం కూడా ఎక్కువవుతోంది. సినిమా ఆలస్యమైతే వడ్డీ భారం పెరగడం, మార్కెట్ పరిస్థితులు మారడం, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోవడం వంటి అంశాలు ఎఫెక్ట్ చూపుతున్నాయని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒక సినిమా రిజల్ట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి రావడం హీరోలు, దర్శకులు, నిర్మాతలకు కూడా పెద్ద సవాల్‌గా మారుతోంది.
అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. వరల్డ్ రేంజ్ క్వాలిటీతో సినిమాలు రూపొందించాలంటే సమయం తప్పనిసరిగా అవసరమని కొందరు దర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సిందేనని చెబుతున్నారు. కానీ కథకు అవసరం లేని ఆలస్యాలు మాత్రం తగ్గాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇదే అంశంపై తాజాగా మరోసారి చర్చ మొదలైంది.
వదలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లా పాల్గొన్న సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు సినీ పరిశ్రమలో యాభై సంవత్సరాల అనుభవం ఉందని గుర్తుచేసిన ఆయన.. ఒకప్పుడు ప్రేక్షకుల కోసం సినిమాలు తీసేవాళ్లమని అన్నారు. ఇప్పుడు రకరకాల కారణాలతో ఒక్కో సినిమా మూడు, నాలుగు సంవత్సరాలు తీస్తుండటం బాధ కలిగిస్తోందని అన్నారు. తమ్మారెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో మరోసారి చర్చకు దారితీశాయి. భారీ సినిమాలకు ఎక్కువ సమయం నిజంగానే అవసరమా? లేక సరైన ప్లాన్ తో ప్రొడక్షన్ టైమ్ ను తగ్గించవచ్చా? అనే ప్రశ్నలపై ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులు మాత్రం మంచి సినిమా కావాలని కోరుకుంటూనే.. అది ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా రావాలని ఆశిస్తున్నారు.