తెలుగు సినిమాలకు డాక్యుమెంటరీల జోష్.. కొత్త ట్రెండ్ మొదలైందా?
ఒకప్పుడు డాక్యుమెంటరీలు అంటే సామాజిక అంశాలు, హిస్టారికల్ పర్సన్స్ లేదా ప్రత్యేక సంఘటనలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి మారుతోంది.
ఒకప్పుడు డాక్యుమెంటరీలు అంటే సామాజిక అంశాలు, హిస్టారికల్ పర్సన్స్ లేదా ప్రత్యేక సంఘటనలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా తెలుగు చిత్రాల చుట్టూ డాక్యుమెంటరీలు, స్పెషల్ వీడియోలు, మేకింగ్ స్టోరీలపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో డాక్యుమెంటరీలు సినిమా ప్రమోషన్స్ లో కీలక భాగంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలు విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు వాటితో పాటు సినిమా ఎలా రూపొందింది? దర్శకుడు, నటీనటులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? భారీ సన్నివేశాలు ఎలా షూట్ చేశారు? వంటి విషయాలను ప్రత్యేక వీడియోల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రేక్షకుల టేస్ట్ లో వచ్చిన మార్పు కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో సినిమా చూసిన తర్వాత స్టోరీతోనే ప్రేక్షకుల ప్రయాణం ముగిసేది. ఇప్పుడు మాత్రం ఆ సినిమా వెనుక జరిగిన ప్రక్రియ గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యూసేజ్ పెరిగిన తర్వాత అభిమానులు తమ అభిమాన హీరోల వర్కింగ్ స్టైల్ ను మరింత దగ్గరగా చూడాలనుకుంటున్నారు.
భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఆ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాల కోసం నెలల తరబడి జరిగే ఏర్పాట్లు, టెక్నికల్ వర్క్, యాక్షన్ సీన్స్ డిజైనింగ్ వంటి అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అందుకే నిర్మాతలు కూడా వీటిని ప్రత్యేక కంటెంట్ గా రూపొందించి విడుదల చేస్తున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఆ మార్పు కారణమైంది. సినిమా విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఎక్స్ ట్రా కంటెంట్ అవసరమవుతోంది.
ఈ నేపథ్యంలో మేకింగ్ వీడియోలు, డాక్యుమెంటరీలు, ప్రత్యేక ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం పెరిగింది. ఒక సినిమా లైఫ్ టైమ్ ను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టాలీవుడ్ లో కూడా ఆ తరహా ప్రయత్నాలు పెరుగుతున్నాయి. పలు భారీ చిత్రాల వెనుక కథలను ప్రత్యేక కార్యక్రమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టి పెడుతున్నారు. సినిమా నిర్మాణంలో పాల్గొన్న టెక్నీషియన్స్ కూడా గుర్తింపు లభిస్తోంది.
మరోవైపు, డాక్యుమెంటరీలు కేవలం ప్రమోషన్స్ గా మాత్రమే కాకుండా సినిమా హిస్టరీని సేఫ్ గా ఉంచే ఎలిమెంట్స్ గా మారుతున్నాయి. ప్యూచర్ లో ఒక సినిమా ఎలా రూపొందిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు, దర్శకులు ఆ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమాల చుట్టూ డాక్యుమెంటరీలు, మేకింగ్ స్టోరీల హవా పెరుగుతోంది. ఇదే వేగం కొనసాగితే రానున్న రోజుల్లో ప్రతి పెద్ద సినిమా వెనుక ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.