తెలుగు తెరపై ఆవిష్కృతం కావాల్సిన అమరగాథలు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన టాలీవుడ్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఎందరో మహానుభావులు జీవితాలను ధారపోశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన టాలీవుడ్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఎందరో మహానుభావులు జీవితాలను ధారపోశారు. బయోపిక్‌ల ట్రెండ్ నేపథ్యంలో తెలుగు చిత్రసీమను శాసించిన కొందరు దిగ్గజాల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), సూపర్ స్టార్ కృష్ణ, మూవీ మోగల్ డి. రామానాయుడు, దర్శకరత్న దాసరి నారాయణరావుల బయోపిక్స్ తీస్తే అవి సినిమాలు మాత్రమే కాదు. తెలుగు సినిమా పరిణామ క్రమానికి నిలువుటద్దాలుగా నిలుస్తాయి.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవితం అద్భుతమైన ప్రేరణాత్మక కథ. సాదాసీదా నేపథ్యం నుండి వచ్చి నటన, క్రమశిక్షణతో పరిశ్రమలో ధృవతారగా వెలిగారు. నాటకాల నుండి వెండితెరకు పరిచయమై `దేవదాసు` భగ్నప్రేమికుడి పాత్రలోనూ, `లైలా మజ్ను` వంటి జానపదాల్లోనూ, భక్త తుకారాం వంటి పౌరాణికాల్లోనూ ఏఎన్నార్ = వైవిధ్యం అసమాన్యం. వీటన్నింటికీ మించి మద్రాసులోనే కేంద్రీకృతమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడంలో ఆయన పోషించిన పాత్ర అసామాన్యమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపన వంటి అంశాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఏఎన్నార్ బయోపిక్ సినీ ప్రేమికులకు ఒక గైడ్‌లా ఉపయోగ పడుతుంది.
ఇక తెలుగు సినిమాలో సరికొత్త ప్రయోగాలకు.. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్‌కు మొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు), మొదటి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం (ఈనాడు), మొదటి జేమ్స్ బాండ్ చిత్రం (గూఢచారి 116), మొదటి 70ఎమ్ఎమ్ స్కోప్ చిత్రాలను పరిచయం చేసిన ఘనత ఆయనదే. పద్మాలయా స్టూడియోస్ స్థాపించి చిత్ర నిర్మాణంలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన కృష్ణ జీవితం ఒక కమర్షియల్ విజువల్ వండర్. కేవలం నటుడిగానే కాకుండా, రాజకీయాల్లోనూ, పంపిణీ రంగంలోనూ ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధించిన విజయాలు వెండితెరపై అత్యంత ఆసక్తికరమైన డ్రామాను పండించగలవు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన నిర్మాత `మూవీ మోగల్ డా. డి. రామానాయుడు జీవిత ప్రయాణం కూడా అద్భుత కావ్యం. ఒకే వ్యక్తి అత్యధిక భాషల్లో (దాదాపు 13 భాషల్లో) 150కి పైగా చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించిన వైవిధ్యమైన చిత్రాలు, పరిశ్రమకు ఆయన పరిచయం చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఖ్య అనంతం. సాధారణ రైతు కుటుంబం నుండి భారత ప్రభుత్వ అత్యున్నత `దాదాసాహెబ్ ఫాల్కే` అవార్డును అందుకునే స్థాయికి ఆయన ఎదిగిన తీరు సినీ వర్గాలకే కాదు వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి అద్భుతమైన కేస్ స్టడీ కాగలదు.
తెలుగు సినీ చరిత్రలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక ప్రభంజనం. 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆయన కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా, పత్రికా సంపాదకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూనే సామాజిక సమస్యల నేపథ్యంలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్ విజయాలు సాధించడం ఆయన ప్రత్యేకత. పరిశ్రమలో కార్మికుల సంక్షేమం కోసం చిన్న సినిమాల మనుగడ కోసం ఆయన చేసిన పోరాటాలు, పరిశ్రమ పెద్దగా ఆయన వహించిన పాత్రను నేటి తరం దర్శకులకు, ప్రేక్షకులకు చూపించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉంది.
ఈ నలుగురు దిగ్గజాల జీవితాలు కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కావు. అవి తెలుగు సినిమా సంస్కృతి, సాంకేతికత, వ్యాపార సామ్రాజ్యం ఎలా రూపాంతరం చెందాయో? చెప్పే మైలురాళ్లు. మహానటి సావిత్రి బయోపిక్ సాధించిన ఘన విజయం మన లెజెండ్స్ కథలకు ఉన్న ఆదరణను నిరూపించింది. సరైన పరిశోధన, నిజాయితీతో కూడిన స్క్రీన్‌ప్లేతో నలుగురి బయోపిక్స్‌ను గనక రూపొందిస్తే అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు. రాబోయే తరాలకు టాలీవుడ్ మూలాలను పరిచయం చేసే అమూల్యమైన దృశ్య కావ్యాలుగా మారుతాయి.