కాజల్ కామెంట్స్‌తో మళ్లీ వైరలైన పాత ట్రెండ్!

తెలుగు కమర్షియల్ సినీ హిస్ట‌రీలో కొన్ని విజువల్ ట్రెండ్స్ ప్రేక్షకుల మదిలో శాశ్వత ముద్ర వేశాయి.

Update: 2026-07-18 17:30 GMT

తెలుగు కమర్షియల్ సినీ హిస్ట‌రీలో కొన్ని విజువల్ ట్రెండ్స్ ప్రేక్షకుల మదిలో శాశ్వత ముద్ర వేశాయి. వాటిలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సినిమాల్లో కనిపించే స్పెష‌ల్ సాంగ్స్ షూటింగ్ శైలి ఎప్పుడూ డిస్క‌ష‌న్ లోనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ నడుము, నాభి చుట్టూ పూలు, పండ్లు వంటి విజువల్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించిన సాంగ్స్ ఒక దశలో ఆయన ట్రేడ్‌మార్క్‌గా మారాయి. ఆనాటి ఆడియ‌న్స్ వాటిని కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా స్వీకరించగా, నేటి సోషల్ మీడియా యుగంలో అదే విజువల్ స్టైల్ మళ్లీ చర్చకు వస్తోంది.

రీసెంట్ గా కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో, ఆమె మాటలు ఇన్‌డైరెక్ట్‌గా అలాంటి పాత కమర్షియల్ ట్రెండ్స్‌ను ఉద్దేశించేవేనా అనే డిస్క‌ష‌న్ సోషల్ మీడియాలో మొదలైంది. గ‌తంలో నాభిని హైలైట్ చేస్తూ చూపించేవారేమో కానీ, ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింద‌ని, తానెప్పుడూ అలాంటి సీన్స్ లో న‌టించ‌లేద‌ని ఆమె చెప్పారు. అయితే ఆమె ఎక్కడా ఏ డైరెక్ట‌ర్ పేరుని ప్రస్తావించలేదు. అయినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ కామెంట్స్ ను టాలీవుడ్‌లో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన గ్లామర్ షూటింగ్ శైలితో అనుసంధానం చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఇండియ‌న్ సినిమాల్లో విజువల్ ప్రెజెంటేషన్ గత పదిహేనేళ్లలో గణనీయంగా మారింది. ఒకప్పుడు సాంగ్స్ లో గ్లామ‌ర్‌ను హైలైట్ చేయడానికి స్పెష‌ల్ క్లోజప్ షాట్లు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు మాత్రం సినిమాటోగ్రఫీ, యాక్షన్ డిజైన్, కలర్ టోన్, ఫ్రేమింగ్, భారీ విజువల్ స్కేల్‌లకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో ఒక్క ప్రాంతీయ ప్రేక్షకుడిని కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాల్లోని ఆడియ‌న్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని మేకర్స్ సినిమాలను రూపొందిస్తున్నారు.

ప్ర‌స్తుతం హీరోయిన్ల ప్రెజెంటేషన్‌లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ మెయిన్ ఎట్రాక్ష‌న్ గా భావించేవారు. ఇప్పుడు మాత్రం పాత్రకు ఉన్న ప్రాధాన్యం, యాక్టింగ్ కు లభించే గుర్తింపు, కథలో పాత్ర ప్రభావం వంటి అంశాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల పెరుగుదలతో హీరోయిన్ల‌ పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు పెరిగాయి.

అయితే పాత సినిమాలను నేటి ప్రమాణాలతో పూర్తిగా కొలవడం కూడా సరైన విధానం కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి కాలానికి తనదైన కమర్షియల్ ఫార్ములా, ప్రేక్షకుల అభిరుచి ఉంటుందని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే రాఘవేంద్రరావు సినిమాల్లో కనిపించిన విజువల్ స్టైల్‌ను ఒక యుగానికి చెందిన సినీ భాషగా చూడాలా, లేక నేటి దృష్టితో తిరిగి విశ్లేషించాలా అన్నది మరో ఆసక్తికర చర్చగా మారింది. కాజల్ కామెంట్స్ తర్వాత ఈ అంశం మళ్లీ తెరపైకి రావడం మాత్రం టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమా పరిణామంపై కొత్త చర్చకు నాంది పలికిందనే చెప్పాలి.

Tags:    

Similar News