ఫెడ‌రేష‌న్ మాట భేఖాత‌ర్.. ఛాంబ‌ర్‌ని లెక్క చేయ‌రు.. సినీపెద్ద‌లు వినోదం చూస్తున్నారా?

ఈ నెలలోనే డ్యాన్సర్స్ అసోసియేషన్‌‌కు అధికారికంగా ఎన్నికలు జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Update: 2026-10-02 06:15 GMT

టాలీవుడ్ లో డ్యాన్సర్ల సంఘం వివాదాలు రోజురోజుకూ ముసలం పుట్టిస్తున్నాయి. ఒకవైపు జానీ మాస్టర్ - సుమలత వర్గం.. మరోవైపు రఘు మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గం హోరా హోరీగా ఫైటింగుల‌కు దిగుతున్నారు. ఈ రెండు వర్గాలలో రెండో వర్గానికి ఫెడరేషన్ కొమ్ముకాస్తోందని ఆరోపిస్తూ డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత వర్గం ఫెడరేషన్‌పై తీవ్ర స్థాయిలో దాడికి దిగింది. జానీ మాస్టర్‌‌కు సహకార నిరాకరణ అమలు చేస్తున్నామని ఫెడరేషన్ ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఫిలిం ఛాంబర్‌లో సినీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేయగా.. అక్కడా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమావేశం జరుగుతున్న చోటికి సుమలత వర్గం వచ్చి డోర్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం గందరగోళానికి దారితీసింది. ఛాంబర్ వద్ద ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని సహా ప్రసన్న కుమార్ వంటి పెద్దలు ఉన్నా కానీ.. సుమలత తన వాదనను గట్టిగా వినిపించి పెద్ద‌ల‌తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ కావడంతో ఈ వివాదంలో అసలు ఏం జరుగుతుందనేది సామాన్యులకు అంతుచిక్కని గందరగోళంగా మారింది.

ఈ నెలలోనే డ్యాన్సర్స్ అసోసియేషన్‌‌కు అధికారికంగా ఎన్నికలు జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఒకసారి ఎన్నికలు ముగిసి నూతన అధ్యక్ష, కార్యవర్గాలను ఎంపిక చేస్తే ఈ సమస్యకు తెరపడుతుందని అంతా భావిస్తున్నారు. అయితే జానీ మాస్టర్- సుమ‌ల‌త‌ వర్గం మాత్రం ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసోసియేషన్‌లో జరుగుతున్న అక్రమాలు, దొంగల గురించి బహిరంగంగా మాట్లాడినందుకే తమపై కక్ష కట్టారని సుమలత ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేనికి ఓటు వేయకపోవడం వలనే తమపై ఈ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నార‌ని మండిపడ్డారు.

ఇక ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సుమలత తీరును త‌ప్పు ప‌డుతూ `ఓవర్ యాక్షన్` అంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తుండగా, మరికొందరు ఈ డ్యాన్సర్ల గోల చూసి విసుగు చెందామని కామెంట్లు పెడుతున్నారు. ``దేశంలో ఇన్ని సమస్యలు ఉంటే వీళ్ల గొడవలకు ఇంత మీడియా అవసరమా?`` అని కొందరు పెదవి విరుస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వివాదాలు ఎప్పటికీ తగ్గుతాయంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఫిలిం ఛాంబర్ నిబంధనలను లెక్క చేయకుండా డ్యాన్సర్లు ఇలా రచ్చ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ డ్యాన్సర్ల వివాదానికి త్వరలోనే ఫుల్‌స్టాప్ పడాలని లేదంటే ఇది మరింత ముదిరి పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలలో జరగనున్న‌ అసోసియేషన్ ఎన్నికల‌తో అయినా ఈ రచ్చకు ముగింపు పలకాలని.. లేదంటే ఈ వర్గపోరు మరింత దూరం వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని అందరూ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News