సమ్మర్ వార్ స్టార్ట్.. హిట్ కొట్టేది ఏ మూవీ?
రెండు నెలలుగా నిస్సత్తువగా కనిపించిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మార్చి మూడో వారం కొంత ఊపిరి పోసింది.;
రెండు నెలలుగా నిస్సత్తువగా కనిపించిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మార్చి మూడో వారం కొంత ఊపిరి పోసింది. ముఖ్యంగా దురంధర్2, ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజులతో థియేటర్ల వద్ద మళ్లీ ప్రేక్షకుల రద్దీ కనిపించింది. తొలి వీకెండ్‌లో ఈ రెండు సినిమాలు మంచి ఓపెనింగ్స్ సాధించగా, రెండో వారం ట్రెండ్ మాత్రం బలహీనపడింది. హిందీ సినిమా అయిన దురంధర్2 మెట్రో సిటీల మల్టీప్లెక్సుల్లో కొంతవరకు నిలబడుతున్నా, సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రం కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. తెలుగు వెర్షన్ ఇప్పటికే స్లో అయింది.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో స్టార్ పవర్ మొదటి మూడు రోజులు బాక్సాఫీస్‌ను నడిపించినా, కంటెంట్ బలం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. మంచి టాక్ లేని కారణంగా ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమా నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్ ముఖ్యమని ఇది మరోసారి నిరూపించింది. మంచి కంటెంట్ ఉంటే భాషా అడ్డంకులు దాటుకుని సినిమాలు రన్ అవుతాయని దురంధర్2 కొంతవరకు నిరూపించినా, అది కూడా స్థిరంగా నిలబడలేకపోవడం గమనార్హం.
ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి నెక్ట్స్ వీకెండ్ వచ్చే రిలీజ్‌లపైకి మళ్లింది. ముఖ్యంగా బైకర్, రాకాస సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. బైకర్ టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్‌గా కనిపిస్తోంది. సంక్రాంతికి హిట్ అందుకున్న శర్వానంద్ ఈ మూవీతో మరోసారి తన ఫామ్‌ను కొనసాగిస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు యూత్‌కు దగ్గరైన కాన్సెప్ట్‌తో రాకాస కూడా ఆకట్టుకుంటోంది. కామెడీ, థ్రిల్ మిక్స్‌తో ఈ సినిమా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం యూత్ ఆడియన్స్ కూడా బాక్సాఫీస్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాల కంటే స్ట్రైట్ తెలుగు కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల మంచి టాక్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో ఓపెనింగ్స్ కంటే సస్టైనబిలిటీ ముఖ్యమవుతోంది.ఈ నేపథ్యంలో బైకర్, రాకాస పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితేనే బాక్సాఫీస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశముంది. లేదంటే స్లంప్ కొనసాగుతుందనే భయం ట్రేడ్‌లో వ్యక్తమవుతోంది.