పాన్ ఇండియా బడ్జెట్ల వెనుక ఆ లెక్కలు నిజమేనా..
పాన్ ఇండియా ఫీవర్ మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ లో బడ్జెట్ల లెక్కల గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
పాన్ ఇండియా ఫీవర్ మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ లో బడ్జెట్ల లెక్కల గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా పట్టాలెక్కక ముందే 300 కోట్లు, 400 కోట్లు అంటూ మేకర్స్ నుంచి లీకులు రావడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు కథాబలం, దర్శకుడి ట్రాక్ రికార్డ్ సినిమాకు బజ్ తీసుకొస్తే, ఇప్పుడు కేవలం ఈ బడ్జెట్ నంబర్సే ఒక ప్రాజెక్ట్ రేంజ్ ను డిసైడ్ చేస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
దీని వెనుక ప్రధానంగా హిందీ మార్కెట్ పై వేసిన ఒక పక్కా పీఆర్ స్ట్రాటజీ ఉందనే గుసగుసలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి. నార్త్ ఆడియన్స్ తో పాటు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కేవలం భారీ స్కేల్ చూసే సౌత్ సినిమాలకు థియేటర్లు కేటాయిస్తున్నారట. ఒక భారీ బడ్జెట్ ఫిగర్ చెబితే తప్ప బాలీవుడ్ బయ్యర్లు కన్నెత్తి చూడని పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే ముంబై పీఆర్ ఏజెన్సీలు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నాయని ట్రేడ్ జనాలు అనుకుంటున్నారు.
కేవలం థియేట్రికల్ బిజినెస్ వరకే కాకుండా డిజిటల్, శాటిలైట్ రైట్స్ బేరసారాల్లో కూడా ఈ నంబర్లే కీలకంగా మారుతున్నాయట. మేకింగ్ కాస్ట్ భారీగా ప్రొజెక్ట్ చేస్తే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి గ్లోబల్ ఓటీటీ సంస్థల నుంచి ఫ్యాన్సీ రేట్లు లాగొచ్చనేది మేకర్స్ ప్లాన్ గా చెబుతున్నారు. ఆ రేట్ల కోసమే ఫీల్డ్ మీద పెడుతున్న యాక్చువల్ ఖర్చుతో సంబంధం లేకుండా అంకెలు పెంచేస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.
ఇక ఇండస్ట్రీ లోపల వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన లెక్క వేరేలా ఉంది. ఈ వందల కోట్లలో సగానికి పైగా కేవలం టైర్-1 హీరోలు, స్టార్ డైరెక్టర్ల పారితోషికాలకే సరిపోతోందట. పాన్ ఇండియా హీరోల రెమ్యునరేషన్లు వంద కోట్లు దాటేస్తుండగా, డైరెక్టర్లు కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. సెట్స్, వీఎఫ్ఎక్స్ కోసం పెడుతున్నది తక్కువే అయినా, టోటల్ ప్యాకేజ్ ను ప్రొడక్షన్ కాస్ట్ గా కలరింగ్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోంది.
అయితే ఈ హైప్ చివరికి బయ్యర్లకే పెద్ద మైనస్ గా మారుతోందని ట్రేడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పేపర్ బడ్జెట్లను చూసి డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు హక్కులు కొనేస్తున్నారట. తీరా కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా బ్రేక్ ఈవెన్ కు దూరంగా ఆగిపోయి నష్టాలు మూటగట్టుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్. వందల కోట్ల సెట్టింగ్స్ ఆశించి థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ కు ఆ రిచ్ నెస్ కనిపించకపోవడంతో ఫస్ట్ డేనే డివైడ్ టాక్ వస్తోందని విశ్లేషిస్తున్నారు.
ఈ బడ్జెట్ల మాయాజాలం గురించి ట్రేడ్ వర్గాలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. మేకర్స్ ప్రకటిస్తున్న బడ్జెట్ లో నుంచి కనీసం 40 శాతం పెంచుతున్నట్లు టాక్ వస్తోంది, అది తీసేస్తేనే అసలు సినిమా మేకింగ్ కాస్ట్ బయటపడుతుందని లోపల లెక్కలు వేసుకుంటున్నారట. మరి ఈ తరహా స్ట్రాటజీలు భవిష్యత్తులో ఎంతవరకు కొనసాగుతాయో చూడాలి.