పాపం ప్రతాప్ కాదు.. పాపం తిరువీర్

కొందరు ఆర్టిస్టులను చూస్తే చాలా మంచి నటులు అనే విషయంలో ఒకట్రెండు సినిమాలకే అర్థం అయిపోతుంది. సినిమాల ఎంపికలోనూ వారి అభిరుచి కనిపిస్తుంది.;

Update: 2026-03-27 18:30 GMT

కొందరు ఆర్టిస్టులను చూస్తే చాలా మంచి నటులు అనే విషయంలో ఒకట్రెండు సినిమాలకే అర్థం అయిపోతుంది. సినిమాల ఎంపికలోనూ వారి అభిరుచి కనిపిస్తుంది. కానీ మంచి సినిమాలు చేసినా.. బాగా పెర్ఫామ్ చేసినా.. కొందరికి తగినంత గుర్తింపు రాదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ క్రియేట్ కావడంలో ఆలస్యం జరుగుతుంటుంది. కమర్షియల్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతుంటారు. తిరువీర్ ఆ కోవకు చెందిన నటుడే. జార్జి రెడ్డి, మసూద, పలాస, పరేషాన్, ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో.. ఈ సినిమాల వరస చూస్తే అర్థమైపోతుంది తిరువీర్ అభిరుచి ఎలాంటిదో? గత ఏఢాది ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’కు చాలా మంచి రివ్యూలు, టాక్ వచ్చాయి. ఓటీటీలో రిలీజైనపుడు అందరూ కొనియాడారు. కానీ థియేటర్లలో సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు భగవంతుడు, పాపం ప్రతాప్ లాంటి విభిన్న చిత్రాలతో రెడీ అవుతున్నాడు తిరువీర్. వీటి ప్రోమోలు చాలా బాగున్నాయి.

తాజాగా ‘పాపం ప్రతాప్’కు సంబంధించిన ప్రెస్ మీట్లో తిరువీర్ చెప్పిన కొన్ని విషయాలు వింటే.. పాపం తిరువీర్ అనిపించక మానదు. ఇన్ని సినిమాలు చేసినా.. తన పేరు చాలామందికి తెలియదని, తనను జనాలు ఇప్పటికీ గుర్తుపట్టడం లేదని తిరువీర్ చాలా ఓపెన్‌గా చెప్పాడు. ఈ మధ్య తాను విమానంలో ప్రయాణిస్తుండగా.. డేట్స్ సర్దుబాటు గురించి ఒకరితో ఫోన్లో మాట్లాడుతుంటే, పక్కనున్న వ్యక్తి తనను ఫిలిం ఇండస్ట్రీనా అని అడిగినట్లు గుర్తు చేసుకున్నాడు తిరువీర్. ఫిలిం ఇండస్ట్రీనా అని అడిగాడంటే.. తనను గుర్తు పట్టలేదని అర్థమైందని, అందుకే తాను నటుడిని, ఫలానా సినిమాల్లో నటించాను అని చెప్పడం ఎందుకని భావించి, ఓజీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి ఆ సంభాషణను అక్కడితో ముగించినట్లు తిరువీర్ చెప్పాడు. ఇంకో సినిమా షూటింగ్ టైంలో తనను కారు డ్రైవర్ అనుకున్నారని అతను గుర్తు చేసుకున్నాడు. ‘మసూద’ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తాను హీరో అంటే నమ్మలేదని.. హీరో అంటే గొడుగు ఉండాలి కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని.. టీంలో వాళ్లు చెప్పాక కానీ నమ్మలేదని తిరువీర్ చెప్పాడు. ఎన్నో మంచి సినిమాలు చేసినా.. నటుడిగా ప్రతిభ చాటుకున్నా ఇంకా గుర్తింపు కోసం తాను పడుతున్న కష్టాల గురించి తిరువీర్ చెబుతుంటే పాపం అనిపించకమానదు. మరి వచ్చే నెల 17న రిలీజ్ కాబోతున్న తన కొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’తో అయినా అతను కోరుకున్న గుర్తింపు, కమర్షియల్ సక్సెస్ దక్కుతాయేమో చూడాలి.

Tags:    

Similar News