సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీమ్.. మొక్కులు చెల్లిస్తూ!

నాని, శ్రీకాంత్ ఓదెల మొక్కలు చెల్లిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Update: 2026-09-29 10:24 GMT

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమి రోజున మేడారం జాతరను నిర్వహిస్తారు... తెలంగాణలోని ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ లో మేడారం గ్రామంలో కొలువైన సమ్మక్క సారలమ్మల దేవతలను దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఇకపోతే మామూలు రోజుల్లో కూడా అమ్మవార్లను దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ది ప్యారడైజ్ టీమ్ సమ్మక్క - సారలమ్మలను దర్శించుకోవడమే కాకుండా మొక్కులు కూడా చెల్లించారు.

ఈ మేరకు ది ప్యారడైజ్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ వారు అధికారికంగా ఈ విషయాన్ని సెప్టెంబర్ 28న చెబుతూ.. ది ప్యారడైజ్ చిత్ర బృందం సెప్టెంబర్ 29 న మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో ఆశీర్వాదం తీసుకోనున్నారు అంటూ ఒక పోస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అన్నట్టుగానే నేడు ది ప్యారడైజ్ చిత్ర బృందం మేడారంలోని పవిత్రమైన శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని సందర్శించి, దేవతల ఆశీర్వాదం అందుకున్నారు. అమ్మవార్లను దర్శించుకున్న వారిలో హీరో నాని, సంపూర్ణేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కనిపించారు.

అనంతరం తమ మొక్కలు చెల్లిస్తూ.. అమ్మవార్లకు తమ బరువుకు సమానంగా బంగారం (బెల్లం) సమర్పించారు. నాని, శ్రీకాంత్ ఓదెల మొక్కలు చెల్లిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ది ప్యారడైజ్ సినిమా ఇటీవల సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం పరవాలేదు అనిపించుకుంది. మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి నాని కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో నానికి తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి సమ్మక్క పాత్ర పోషించారు. ఇక మోహన్ బాబు, రాఘవ్ జుయల్ , కయాదు లోహర్ కీలకపాత్రలు పోషించగా బిర్యాని పాత్రలో సంపూర్ణేష్ బాబు నటించి.. తన నటనతో ఆకట్టుకున్నారు . తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ వంటి భాషలలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదలైంది.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. సుమారుగా 150 నుండి 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 101 కోట్లు జరిగింది. ఇకపోతే ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమాకు 145.59 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News