కోట తర్వాత ఆ స్థాయి నటుడు ఎందుకు రాలేదు?

తెలుగు సినీ చరిత్రలో కొంద‌రి స్థానాల్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. నటులు మారతారు, తరాలు మారతాయి, కథల తీరు మారుతుంది.

Update: 2026-07-10 07:28 GMT

తెలుగు సినీ చరిత్రలో కొంద‌రి స్థానాల్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. నటులు మారతారు, తరాలు మారతాయి, కథల తీరు మారుతుంది. కానీ కొందరు న‌టులు సృష్టించిన చ‌రిత్ర‌ను మాత్రం ఎవరూ అందుకోలేరు. అలాంటి అరుదైన నటుల్లో కోట శ్రీనివాసరావు పేరు ముందువరుసలో ఉంటుంది. ఆయన జయంతి సందర్భంగా మరోసారి వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. కోట తర్వాత ఆ స్థాయి విలక్షణ నటుడు టాలీవుడ్ లో ఎందుకు కనిపించలేదు? అని. కోట శ్రీనివాసరావును కేవలం విలన్‌గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిర్వచించడం ఆయన టాలెంట్ ను చిన్నబుచ్చినట్లే అవుతుంది. ఒకే నటుడు ఒక సినిమాలో ఆడియ‌న్స్ ను నవ్వించగలడు, మరో సినిమాలో భయపెట్టగలడు, ఇంకో సినిమాలో కంటతడి పెట్టించగలడు. ఈ రేంజ్ డిఫ‌రెన్స్ న‌టుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. సినిమాలో క్యారెక్ట‌ర్ ఎంత పెద్దద‌నేది కాదు, ఆ క్యారెక్ట‌ర్ ను ఎంత బలంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిపారనేదే కోట స్పెషాలిటీ.

నేటి సినిమాలను పరిశీలిస్తే టెక్నాలజీ ఎంతో డెవ‌ల‌ప్ అయింది. భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టైలిష్ మేకింగ్, విజువల్ ఎలివేషన్లు క్యారెక్ట‌ర్ల‌ను ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ గా చూపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఇవేవీ లేకుండానే కేవలం హావభావాలు, డైలాగ్ డెలివ‌రీ, కళ్లలో కనిపించే ఇంటెన్సిటీతోనే సీన్ ను నిలబెట్టిన నటులు ఉండేవారు. ఆ లిస్ట్ లో కోట శ్రీనివాసరావు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే స్పెష‌ల్ గా ఎలాంటి ఎలివేషన్ అవసరం ఉండేది కాదు. అత‌ని క్యారెక్ట‌రే ఆడియ‌న్స్ ను ఆకట్టుకునేది. ఇప్పటి నటులు కోట నుంచి నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం కూడా ఇదే. ప్రతి పాత్రకు ఒకే తరహా బాడీ లాంగ్వేజ్ కాకుండా, పాత్ర స్వభావానికి తగ్గట్టుగా తన నడక, మాట, వాయిస్, ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్స్ ను మార్చుకునే సామర్థ్యం ఆయన సొంతం. అందుకే ఆయన పోషించిన పాత్రలు ఒక‌దానితో మరొకటి పోలి ఉండవు. ప్రతి సినిమా చూసినప్పుడు కొత్త వ్యక్తిని చూస్తున్న భావన కలిగించగలిగారు.

అంతేకాదు, ఎన్నో సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు హీరోతో సమానంగా గుర్తుండిపోయాయి. కొన్ని సందర్భాల్లో ఆడియ‌న్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో కంటే కోట చేసిన సీన్స్ గురించే ఎక్కువ‌గా మాట్లాడుకునేవారు. కథలో పాత్ర నిడివి ఎంత ఉందన్నది కాదు, ఆ కొద్ది నిమిషాల్లో ఎంత ఇంపాక్ట్ చూపించారనేదానికి ఆయన ఎన్నో ఉదాహరణలు సృష్టించారు. అదే ఒక గొప్ప నటుడి అసలైన స‌క్సెస్‌గా సినీ విశ్లేషకులు భావిస్తుంటారు.

టాలీవుడ్ లో ఇప్పటికీ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, కోట స్థాయిలో విలన్, కామెడీ, ఎమోష‌న్, పొలిటీషియ‌న్, కుటుంబ పెద్ద, స్వార్థపరుడు, అమాయకుడు వంటి పూర్తిగా భిన్నమైన పాత్రలను ఒకే స్థాయిలో మోసే నటుడు కనిపించడం లేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో తరచూ వినిపిస్తుంది. అందుకే కోట తర్వాత వచ్చిన ప్రతి తరాన్ని ఆయనతో పోల్చే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది.

అయితే ఒక నటుడి గొప్పతనం ఆయన అందుకున్న అవార్డులతో మాత్రమే కొలవలేం. దశాబ్దాలు గడిచినా ఆయన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాలలో సజీవంగా ఉండటం, కొత్త తరానికి కూడా అవే సీన్స్ ఆసక్తిని కలిగించడం నిజమైన గుర్తింపుగా చెప్పుకోవ‌చ్చు. అదే కారణంగా కోట శ్రీనివాసరావు పేరు టాలీవుడ్ హిస్ట‌రీలో ఒక నటుడిగా మాత్రమే కాదు, నటనకు ఓ ప్రమాణంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News