టాలీవుడ్‌లో ఫ్లెక్సీ టికెట్ రేట్ల పై చర్చ‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో పెంచుతున్న ధరలు సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేస్తున్నాయనే వాదన చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది.;

Update: 2026-05-09 14:30 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో పెంచుతున్న ధరలు సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేస్తున్నాయనే వాదన చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫ్లెక్సీ ప్రైసింగ్ విధానాన్ని టాలీవుడ్‌లో కూడా ప్రవేశపెట్టాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ విధానం వల్ల వారాంతాల్లో ఒక ధర, పనిదినాల్లో మరో ధర ఉండే అవకాశం ఉంటుంది. ఇది బాక్సాఫీస్ సమీకరణాలను మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి.

సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిన తరుణంలో పాత ధరలతో పెట్టుబడిని వెనక్కి రాబట్టడం కష్టమవుతోంది. అందుకే రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాల్లో ధరలను కొంచెం ఎక్కువగా ఉంచి కలెక్షన్లు తగ్గే సోమవారం నుండి గురువారం వరకు ధరలను తగ్గించడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు పనిదినాల్లో తక్కువ ధరకే సినిమా చూసే వెసులుబాటు కలుగుతుందని తద్వారా ఫుట్‌ఫాల్స్ పెరుగుతాయని నిర్మాతల మండలి భావిస్తోంది.

అయితే ఇప్పటికే పెరిగిన సినిమా టికెట్ ధరలు, క్యాంటీన్ ఖర్చుల పట్ల ప్రేక్షకులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఓటీటీల రాకతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించిన సమయంలో, ఫ్లెక్సీ ప్రైసింగ్ పేరుతో వారాంతాల్లో ధరలు మరింత పెంచితే అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకే ప్రేక్షకులు ఎంత ధరైనా పెట్టి చూస్తారని యావరేజ్ సినిమాలకు ఫ్లెక్సీ రేట్లు పెంచితే ఓపెనింగ్స్ దెబ్బతినే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధానం సక్సెస్ కావాలంటే దానిని అమలు చేసే తీరుపై స్పష్టత ఉండాలి. దీన్ని వాడుకోవడం పక్కాగా తెలిసినప్పుడే సాధ్యమవుతుంది. కేవలం రేట్లు పెంచడమే కాకుండా డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు నిజంగానే ధరలను తగ్గించి ప్రేక్షకులను ఆకర్షించాలి. కొన్ని మల్టీప్లెక్స్ లు ఇప్పటికే వీక్ డేస్ లో తక్కువ ధరలను అమలు చేస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రతి సినిమాకు ఒకే రకమైన ధర కాకుండా సినిమా బడ్జెట్ , క్రేజ్ ని బట్టి ధరలను నిర్ణయించే పారదర్శకమైన వ్యవస్థ అవసరమని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రా యపడుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెద్ద సినిమాలకు ప్రత్యేక ధరల పెంపునకు అనుమతులు ఇస్తున్నాయి. అయితే ఇది కేవలం మొదటి వారం లేదా పది రోజులకు మాత్రమే పరిమితం అవుతోంది. అలా కాకుండా సినిమా రన్‌ను బట్టి డైనమిక్ పద్ధతిలో ధరలు మారితే చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. టికెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడటానికి మొగ్గు చూపుతారని `హనుమాన్` వంటి చిత్రాల విజయాలు నిరూపించాయి. ఫ్లెక్సీ ప్రైసింగ్ అనేది రెండంచుల కత్తి లాంటిది. దీనిని లాభాల కోసమే కాకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మార్గంగా వాడితేనే టాలీవుడ్‌కు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు, నిర్మాతలు , ఎగ్జిబిటర్లు సమన్వయంతో నిర్ణీత ధరల పట్టికను రూపొందించినప్పుడే ఈ విధానం విజయవంతం అవుతుంది. సినిమా అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండే వినోదంగా ఉన్నంత కాలమే పరిశ్రమ బాగుంటుంది. ధరల భారంతో వారిని దూరం చేసుకోకూడదని సినీ అభిమానులు కోరుకుం టున్నారు.

Tags:    

Similar News