కేన్స్ 2026 వేదికపై తారల దుమారం..ఈసారి ముచ్చటగా ముగ్గురు!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 79వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు 2026 మే నెలలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.;
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 79వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు 2026 మే నెలలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది భారత్ తరపున రెడ్ కార్పెట్‌పై ఎవరు మెరవబోతున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ.. యువ నటి తారా సుతారియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తన కెరీర్‌లో మొదటిసారి కేన్స్ వేదికపై అడుగుపెడుతున్న తారా.. అక్కడ తన గ్లామర్‌తో దుమారం రేపడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం తారా వ్యక్తిగత అవకాశంగా కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను చాటిచెప్పే మరో అద్భుతమైన ఛాన్స్ గా మారుతోంది.
తారా సుతారియా అరంగేట్రానికి ప్రధాన బలాన్ని చేకూర్చింది తను నటించిన `టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్` చిత్రం. దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా చుట్టూ ఉన్న అంతర్జాతీయ క్రేజ్.. తారాను గ్లోబల్ ఆడియన్స్‌కు మరింత చేరువ చేసింది. ఇప్పటికే గీతు మోహన్ దాస్ వంటి ప్రతిభావంతులైన దర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న తారా.. కేన్స్ వేదిక ద్వారా తన నటనా సామర్థ్యాన్ని.. ఫ్యాషన్ సెన్స్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ప్రస్తుతం తారా చేతిలో ఉన్న అంతర్జాతీయ ప్రాజెక్టుల దృష్ట్యా.. ఈ ప్రదర్శన తారా కెరీర్‌ను మలుపు తిప్పే `స్ట్రాటజిక్ మైలురాయి`గా మారనుంది.
ఈ ఏడాది కేన్స్ వేదికపై తారా సుతారియా ఒంటరిగా కాకుండా.. మరో ఇద్దరు దిగ్గజ సుందరీమణులతో కలిసి సందడి చేయబోతుండటం విశేషం. దశాబ్దాలుగా కేన్స్ రెడ్ కార్పెట్‌కు చిరునామాగా మారిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ .. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్థిరపడిన అలియా భట్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. తారా వంటి వర్ధమాన నటి.. ఐశ్వర్య - అలియా వంటి సీనియర్ తారలతో కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోవడం భారతీయ సినిమా పవర్‌ను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడమే అవుతుంది. ముచ్చటగా ముగ్గురు భారతీయ భామలు అక్కడ చేసే హంగామా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత దశాబ్దాన్ని పరిశీలిస్తే.. కేన్స్ వేదికపై భారతీయ నటీమణుల ఆరంగేట్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. 2018లో కంగనా రనౌత్, 2019లో ప్రియాంక చోప్రా, 2023లో సారా అలీ ఖాన్, మృణాల్ ఠాకూర్ .. 2025లో అలియా భట్, జాన్వీ కపూర్ వంటి వారు తమదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో 2026లో తారా సుతారియా రాక.. బాలీవుడ్ నుండి గ్లోబల్ మార్కెట్‌లోకి కొత్త తరం తారల్లో ఉత్సాహం నింపుతోంది. ఒకప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఈ వేదిక.. ఇప్పుడు ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతుండటం శుభపరిణామం.
చివరగా.. కేన్స్ వంటి ఉత్సవాలు కేవలం సినిమా ప్రదర్శనలకు మాత్రమే పరిమితం కాకుండా.. ఒక భారీ ఫ్యాషన్ .. బిజినెస్ నెట్‌వర్కింగ్ వేదికలుగా రూపాంతరం చెందాయి. తారా సుతారియా లాంటి తారలు అంతర్జాతీయ వేదికలపై మెరిసినప్పుడు.. అది మన సినిమాల కమర్షియల్ వ్యాల్యూను పెంచడంతో పాటు అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో ఒప్పందాలకు దారితీస్తుంది. ఈ మే నెలలో కేన్స్ రెడ్ కార్పెట్‌పై తారా సుతారియా సృష్టించబోయే ఆ `గ్లామర్ మ్యాజిక్` భారతీయ చలనచిత్ర రంగానికి మరింత ప్రచారాన్ని తెస్తుందనడంలో సందేహం లేదు. ఎవరు ఈ మెరుపు తీగలు? అంటూ హాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు వెతికే ఈ వేదికపై తారా కోసం కూడా ద్వారాలు తెరుచుకుంటాయేమో చూడాలి.. ఐశ్వర్యారాయ్ కి అప్పట్లో హాలీవుడ్ నుంచి ఎలాంటి అవకాశాలు వెల్లువెత్తాయో ఇప్పుడు తారా సుతారియాకూ కూడా అలానే అవకాశాలు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.