డ్రగ్ టెస్టుల రగడ: ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టాలీవుడ్ సీరియస్
సినీ పరిశ్రమ, మాదకద్రవ్యాల అంశం ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.;
సినీ పరిశ్రమ, మాదకద్రవ్యాల అంశం ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా నటీనటుల వ్యక్తిగత విషయాలపై జరిగిన విమర్శలకు ఇండస్ట్రీ పెద్దల నుంచి గట్టి సమాధానమే వస్తోంది.జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నటీనటులు తెరపై మద్యం తాగుతున్నట్లు కనిపిస్తే వారిని హీరోలు అంటున్నారని, అదే నాయకులు దీని గురించి మాట్లాడితే జీరోలని ఎందుకు చూస్తారని ప్రశ్నించారు. సినిమాల్లో ఆల్కహాల్ సీన్లు ఉండకూడదని, వాటిని సెన్సార్ బోర్డు బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు విషయానికి వస్తే, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి నటీనటులకు డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని కోరారు. "ప్రతి 90 రోజులకు ఒకసారి యాక్టర్లందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ రిపోర్టులను సబ్మిట్ చేసిన తర్వాతే వారి సినిమాలను రిలీజ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా టెస్ట్ చేయించుకోకపోతే వారు డ్రగ్స్ వాడుతున్నట్లేనని భావించాలి" అని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సీరియస్ గా స్పందించారు. "డ్రగ్స్ అనేవి కేవలం సినిమా ఇండస్ట్రీలోనే లేవు. దేశం మొత్తం మీద వేల కోట్ల డ్రగ్స్ దందా జరుగుతోంది. కేవలం సినిమా వాళ్ల మీద మాత్రమే బురద చల్లడం సరికాదు" అని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుల్లో డ్రగ్స్ తీసుకునేవారు లేరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు బాధ్యతగా మాట్లాడాలని, సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ 'ఖుషి', బాలకృష్ణ సినిమాల్లోని సన్నివేశాలను ఉదాహరణలుగా చూపించారు. ఇలాంటి సీన్లు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని ఆయన వాదించారు. అందుకే ప్రతి 90 రోజులకు ఒకసారి హెయిర్ టెస్టింగ్ విధానం ద్వారా డ్రగ్స్ గుర్తింపు పరీక్షలు జరపాలని ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ నాయకులు,సినీ రంగం మధ్య ఒక యుద్ధంలా మారింది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నప్పటికీ, సినిమా ఇండస్ట్రీకి ప్రతీ వివాదాన్ని లింక్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు. డ్రగ్స్ నియంత్రణ అనేది అందరి బాధ్యత అయినప్పటికీ, ఒకే రంగాన్ని వేలెత్తి చూపడంపై ఇండస్ట్రీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఏవైనా కొత్త నిబంధనలు తెస్తుందో లేదో చూడాలి.