సత్యరాజ్, విజ‌య్ ను టార్గెట్ చేశారా?

తమిళ రాజకీయాల్లో సినిమా వర్సెస్ రాజకీయాల చర్చ మళ్లీ వేడెక్కింది. ప్రముఖ నటుడు స‌త్యరాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా సంచలనం సృష్టించాయి.;

Update: 2026-03-03 11:17 GMT

తమిళ రాజకీయాల్లో సినిమా వర్సెస్ రాజకీయాల చర్చ మళ్లీ వేడెక్కింది. ప్రముఖ నటుడు స‌త్యరాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా సంచలనం సృష్టించాయి. సినిమా డైలాగులు, పంచ్‌లతో రాజకీయాల్లో ప్రభావం చూపాలనుకునే నాయకులను పరోక్షంగా విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీతో అడుగుపెట్టిన TVK చీఫ్ విజ‌య్ వైపు సంకేతాలుగా భావిస్తున్నారు.

మాట‌లు ప్ర‌తీ యాక్ట‌ర్ చెప్తాడు

ఒక కార్యక్రమంలో మాట్లాడిన సత్యరాజ్, పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలను ఆకట్టుకునే మాటలకంటే రూలింగ్ లో చూపే బాధ్యత, కార్యాచరణ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రవేశించే వారు ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన, విధానాలపై దృఢమైన స్ప‌ష్ట‌త కలిగి ఉండాలని సూచించారు.

మ‌త‌శ‌క్తుల‌కు చోటు లేదు

తమిళనాడును మరో అయోధ్యగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సత్యరాజ్ చేసిన వ్యాఖ్య కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో సనాతన వర్సెస్ ద్రావిడ సిద్ధాంతాల మధ్యే అసలు పోటీ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నంత వరకు మతశక్తులకు రాష్ట్రంలో చోటు ఉండదని సత్యరాజ్ వ్యాఖ్యానించారు.

త‌మిళ‌నాడులో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి నాయ‌కులు రావ‌డం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత లాంటి నాయకుల వారసత్వం ఇప్పటికీ చర్చల్లో ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావం, అభిమానుల ఆధారిత రాజకీయాలు, స్టార్ ఇమేజ్ ఆధారంగా ఓట్ల సాధన వంటి అంశాలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ నేతృత్వంలోని పార్టీపై యువతలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, సత్యరాజ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సినిమా వేదికపై వినిపించే ఘాటు డైలాగులు ప్రజలను ఆకట్టుకోవచ్చు గానీ, పాలనలో అవి సరిపోవని ఆయన సూచించిన సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలపై విజయ్ లేదా ఆయన పార్టీ తరఫున ఎలాంటి రియాక్ష‌న్ వస్తుందో చూడాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. తమిళనాడులో రాబోయే ఎన్నికల పోరు కేవలం పార్టీల మధ్యే కాకుండా సిద్ధాంతాల మధ్య జ‌ర‌గ‌నుంద‌నేది మాత్రం స్ప‌ష్ట‌మైంది.

Tags:    

Similar News