కమల్,రజనీ పొలిటికల్ మిస్‌ఫైర్!
అక్కడ సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి చక్రం తిప్పిన వాళ్లు, దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన వాళ్లూ ఉన్నారు.;
తమిళనాట రాజకీయాలకు సంబంధించి వింత పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి చక్రం తిప్పిన వాళ్లు, దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన వాళ్లూ ఉన్నారు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమా హేమీలు సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్లే..తమిళ రాజకీయాల్లో కీలకంగా నిలిచిన వారే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. సినిమాల్లో స్టార్లుగా, లెజెండ్స్‌గా పేరు తెచ్చుకుని తీవ్ర ప్రభావాన్ని చూపించిన వారు రాజకీయాల్లో మాత్రం నిలబడలేక తడబాటుకు గురవుతున్నారు.
తమిళ రాజకీయాల్లో సినీ రంగం నుంచి వెళ్లిన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఏ స్థాయిలో ప్రభావం చూపించారో, తమిళ రాజకీయాలని ఏ విధంగా శాసించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుటి స్టార్స్ మాత్రం వారికి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నారు. కారణం వారు తీసుకుంటున్న నిర్ణయాలే. రజనీకాంత్ తనకున్న క్రేజ్‌తో తమిళరాజకీయాల్లో ఓ ప్రభంజనం సృష్టించాలని భావించారు. పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి కొన్ని దశాబ్దాలుగా తనని ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయాలనుకున్నారు.
`మక్కల్ సేవై కచ్చి` పేరుతో పార్టీని స్థాపించాలనుకున్నారు. చాలా వేదికలపై తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలు, ఆరోగ్య సమస్యల కారణంగా పార్టీని ప్రకటించకుండానే రాజకీయ అరంగేట్రానికి తెరదించి షాక్ ఇచ్చారు. రజనీ తరువాత రాజకీయ అరంగేట్రం చేస్తానని చెప్పి తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన సీనియర్ హీరో కమల్ హాసన్.
2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీ విరమించుకున్నా కమల్ ముందడుగు వేయడంతో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అంతా భావించారు. కానీ కమల్ సాధించింది శూన్యం. పార్టీ పేరుతో కమల్ రాజ్యసభకు ఎంపిక వెళ్లాడే కానీ సాధించింది మాత్రం ఏమీ లేదు. అది కూడా సొంత పార్టీ కారణంగా కాకుండా డీఎంకే బలపరిచడం వల్ల ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టి అందరిని షాక్‌కు గురి చేశారు.
పార్టీని స్థాపించిన తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోవడం గమనార్హం. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తమది ఓ పార్టీ అన్న విషయాన్నే కమల్ మర్చిపోయి డీఎంకేకు మద్దతుగా నిలవడం, పోటీ నుంచి తప్పుకోవడం సొంత క్యాడర్‌ని షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే డీఎంకే అండతో పార్లమెంట్ సభ్యుడిగా మారిన కమల్ ఆ కృతజ్ఞతని నిరూపించుకోవడం కోసం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తమ పార్టీని తప్పించి మరో తప్పు చేయడంతో సొంత పార్టీలోనే ములం మొదలైంది.
ముందు తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన కమల్ పార్టీ సీట్ల కోసం డీఎంకే పార్టీని సంప్రదించడం, 10 నుంచి 15 సీట్లు అయినా ఇవ్వండని కోరడం, వారు నిరాకరించడంతో పార్టీని అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి కమల్ తప్పించడం ఇప్పుడు అసలుకే మోసం వచ్చేలా మారింది. పార్టీ టికెట్‌ల కోసం సొంత పార్టీ నేతల వద్దే కమల్ ఒక్కొ వ్యక్తి వద్ద నుంచి 50 వేలు వసూలు చేసి ఇప్పుడు పోటీ చేయడం లేదని తప్పుకోవడం పార్టీ వర్గాల్లో ఆగ్రహా జ్వాలలు రగిలిస్తోంది. పార్టీ పెట్టకుండానే రజనీ ఫెయిల్ అయితే కమల్ పార్టీ పెట్టి మరీ ఇలాంటి నిర్ణయాలతో విఫలం కావడం గమనార్హం. దీంతో తమిళనాట కమల్ పార్టీ చర్చనీయాంశంగా మారి సినీ స్టార్ల రాజకీయ అరంగేట్రాలపై సెటైర్లు పడుతున్నాయి.