మాతృత్వానికి సరికొత్త నిర్వచనం సుస్మితా సేన్!

విశ్వసుందరి కిరీటంతో భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన సుస్మితా సేన్ వెండితెరపైనే కాదు.

Update: 2026-05-28 08:30 GMT

విశ్వసుందరి కిరీటంతో భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన సుస్మితా సేన్ వెండితెరపైనే కాదు. నిజ జీవితం లోనూ ఎంతో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా సమాజంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుని పిల్లలను కనడం ఓ ఆనవాయితీగా వస్తోంది. కానీ సుస్మితా సేన్ 24 సంవత్సరాల వయసులోనే పెళ్లి కాకుండా త‌ల్లైంది. కెరీర్ అత్యున్నత దశలోనే 2000 సంవత్సరంలో `రేనీ` అనే ఆడపిల్లను దత్తత తీసుకుని సంచలనం సృష్టించారు. ఒక ఒంటరి మహిళగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఆనాటి సామాజిక నిబంధనలను పూర్తిగా సవాలు చేసింది. ఆ కాలంలో ఒక యువ నటి పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకోవడం అనేది సమాజం అంత తేలికగా అంగీకరించలేదు.

సుస్మితా ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న సమాజం, చిత్ర పరిశ్రమ తీవ్రమైన అభ్యంతరాలను, సందేహాలను వ్యక్తం చేశాయి. ఇంత చిన్న వయసులో పెళ్లి కాకుండానే బిడ్డ బాధ్యతను స్వీకరిస్తే కెరీర్ నాశనమవుతుందని, భవిష్యత్తులో వివాహ జీవితానికి ఇబ్బందులు ఎదురవుతాయని చాలా మంది సుస్మిత‌ను హెచ్చరించారు. అయితే ఆ ప్రతిఘటనలను, విమర్శలను సుస్మిత‌ ఎంతో నిబ్బరంతో ఎదుర్కొన్నారు. సామాజిక వ్యతిరేకతతో పాటు, చట్టపరమైన ఇబ్బందులు కూడా పెద్ద సవాలుగా నిలిచాయి. ఆ రోజుల్లో భారతదేశంలో ఒంటరి మహిళలకు దత్తత ఇచ్చే ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా ఉండేది.

ఒక యువతి అదీ గ్లామర్ రంగంలో ఉన్న వ్యక్తి ఒక బిడ్డకు సరైన పెంపకం - రక్షణ ఇవ్వగలదా? లేదా ? అనే కోణంలో న్యాయస్థానాలు సైతం సుదీర్ఘమైన విచారణలు జరిపాయి. తన మాతృత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకోవడానికి సుస్మిత కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చివరకు ఆమెలోని నిజాయితీని, తపనను గుర్తించిన న్యాయస్థానం సుస్మిత‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మాతృత్వం అనేది శారీరక సంబంధానికి మాత్రమే పరిమితం కాదని అది మనసులకు సంబంధించిన బంధమని సుస్మితా సేన్ బలంగా నమ్మారు.

సమాజం చూపే వివక్షను లేదా అనుమానాలను సుస్మిత‌ మనసు తీసుకోలేదు. తన హృదయం చెప్పిన మాటను విని ఒక అనాథ బిడ్డకు సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వడమే ధ్యేయంగా ముందుకు సాగారు. చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణంలోనూ సుస్మిత‌ ప్రదర్శించిన మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం ఆమెను ఓ సాధారణ నటి నుండి అసాధారణమైన వ్యక్తిగా నిలబెట్టాయి. కాలక్రమేణా సుస్మితా సేన్ ఎంత సరైందో రుజువైంది. రేనీ బాధ్యతాయుతమైన యువతిగా ఎదిగింది. ఆ తర్వాత 2010లో సుస్మితా అలీషా అనే మరో ఆడపిల్లను కూడా దత్తత తీసుకున్నారు.

వారి మధ్య ఉన్న ఆత్మీయత, అనుబంధం నేడు ఎంతో మందికి ఆదర్శవంతమైన ఉదాహరణగా నిలిచింది. సుస్మితాసేన్ చూపిన చొరవ భారతదేశంలో దత్తత నిబంధనలలో మార్పులు రావడానికి ఎంతో మంది ఒంటరి పురుషులు , మహిళలు ధైర్యంగా పిల్లలను దత్తత తీసుకునేలా ప్రేరణనివ్వడానికి మార్గం సుగమం చేసింది. నిజమైన సాధికారత అనేది సమాజం గీసిన గీతల్లో బతకడం కాదు. నమ్మకాలకు కట్టుబడి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. సుస్మితా సేన్ ప్రయాణం ఒక సెలబ్రిటీ కథ మాత్రమే కాదు. అది ఒక స్త్రీ సంకల్ప బలానికి నిదర్శనం. రక్తం పంచుకుంటేనే బంధాలు ఏర్పడవు. ప్రేమ , ఆప్యాయత ఉంటే చాలు ఎలాంటి త్యాగానికైనా సిద్ద‌ప‌డొచ్చు అని నిరూపించారు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలకు భిన్నంగా, ప్రేమతోనే అందమైన ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చని సుస్మితాసేన్ జీవితం చాటి చెబుతోంది.

Tags:    

Similar News