9500 కోట్లతో మారియో అరాచకం!
హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వీడియో గేమ్ ఆధారిత చిత్రాల ప్రభంజనం కొనసాగుతోంది.
హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వీడియో గేమ్ ఆధారిత చిత్రాల ప్రభంజనం కొనసాగుతోంది. ప్రముఖ యానిమేషన్ చిత్రం `ది సూపర్ మారియో బ్రదర్స్ మూవీ` కి సీక్వెల్‌గా రిలీజ్అ యిన `ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ` సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన 10 వారాల్లోనే ఈ చిత్రం బిలియన్ డాలర్ల క్లబ్‌లో అడుగు పెట్టింది. దీంతో 2026 లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్ (సుమారు 9,560 కోట్లు) వసూళ్లను సాధించిన మొట్ట మొదటి చిత్రంగా ఈ యానిమేషన్ అడ్వెంచర్ నిలిచింది. ఏప్రిల్ 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకగా వసూళ్లను సాధిస్తోంది.
తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా ఒక్క అమెరికా (డొమెస్టిక్) మార్కెట్లోనే 428.5 మిలియన్ల (సుమారు 4097 కోట్లు) వసూళ్లను రాబట్టింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో 571.5 మిలియన్ల (సుమారు 5,464 కోట్లు) కలెక్షన్లతో సత్తా చాటింది. క్రిటిక్స్ నుండి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ .. మౌత్ టాక్ కారణంగా లాంగ్ రన్‌లో భారీ మైలురాయిని అధిగమించింది. యూనివర్సల్ పిక్చర్స్- ఇల్యూమినేషన్ స్టూడియోస్ - నింటెండో సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన వీడియో గేమ్ అడాప్టేషన్ల జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
మొదటి స్థానంలో 1.36 బిలియన్ల వసూళ్లతో దీని మొదటి భాగం నిలిచింది. కేవలం రెండు సినిమాలతోనే ఈ సూపర్ మారియో ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా కలిపి 2.30 బిలియన్ల టికెట్ అమ్మకాలను నమోదు చేయడం విశేషం. ఈ అసాధారణ విజయంతో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ ఫ్రాంచైజీల జాబితాలో సూపర్ మారియో 9వ స్థానానికి చేరుకుంది. అంతరిక్ష సాహసయాత్ర కథాంశంలో ప్రధాన పాత్రలైన మారియో .. లుయిగిలకు హాలీవుడ్ స్టార్స్ క్రిస్ ప్రాట్, చార్లీ డే తమ గాత్రాన్ని అందించారు. వీరితో పాటు ప్రిన్సెస్ పీచ్‌గా అన్యా టేలర్-జాయ్, బౌజర్‌గా జాక్ బ్లాక్ తమ పాత్రలను పునరావృతం చేశారు.
ఈ సీక్వెల్‌లో కొత్తగా చేరిన బ్రి లార్సన్ (ప్రిన్సెస్ రోజాలినా), బెన్నీ సఫ్డీ (బౌజర్ జూనియర్), డోనాల్డ్ గ్లోవర్ (యోషి), గ్లెన్ పావెల్ (ఫాక్స్ మెక్‌క్లౌడ్)ల వాయిస్ ఓవర్లు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఆరన్ హార్వత్, మైఖేల్ జెలెనిక్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ భారీ విజయం ఇల్యూమినేషన్ - నింటెండో సంస్థల భాగస్వామ్యాన్ని హాలీవుడ్‌లో మరింత బలోపేతం చేసింది. కేవలం 110 మిలియన్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన చిత్రం పెట్టుబడిపై ఊహించని స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది వస్తున్న ఇతర భారీ చిత్రాలైన మైఖేల్ జాక్సన్ బయోపిక్ `మైఖేల్ (888 మిలియన్లు), `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (679 మిలియన్లు) వంటి చిత్రాలను వెనక్కి నెట్టి మారియో అగ్రస్థానంలో నిలిచింది.
థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకున్న ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ - ఫిజికల్ బ్లూ-రే ఫార్మాట్లలో విడుదల కానుంది. వీడియో గేమ్స్ కేవలం గేమింగ్ కన్సోల్‌లకే పరిమితం కాకుండా థియేటర్లలో వందల కోట్ల బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసించగలవని ఈ చిత్రం నిరూపించింది. నింటెండో సంస్థ సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తదుపరి భారీ ఫీచర్ ఫిలింను 2028లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారియో సృష్టించిన ఈ బిలియన్ డాలర్ల రికార్డు రాబోయే రోజుల్లో మరిన్ని లార్జ్-స్కేల్ గేమ్ అడాప్టేషన్స్ రావడానికి మార్గం సుగమం చేసింది.