ఖిలాడీయోన్ కా ఖిలాడీ సాంగ్ క్రెడిట్ వివాదం!
ప్రసిద్ధ పాప్ గాయని సునీతా రావు 1990ల కాలంలో శ్రోతలను ఊపేసిన సూపర్ హిట్ పాట `ఇన్ ది నైట్ నో కంట్రోల్` గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
ప్రసిద్ధ పాప్ గాయని సునీతా రావు 1990ల కాలంలో శ్రోతలను ఊపేసిన సూపర్ హిట్ పాట `ఇన్ ది నైట్ నో కంట్రోల్` గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 1996లో రిలీజ్ అయిన `ఖిలాడీయోన్ కా ఖిలాడీ` చిత్రంలోని ఈ పాటకు క్రెడిట్ ఇచ్చే క్రమంలో ఇన్నాళ్లూ తన పేరు తప్పుగా పడిందని, సరైన గుర్తింపు లభించలేదని గుర్తు చేసుకున్నారు. అక్షయ్ కుమార్, రేఖలపై చిత్రీకరించిన ఈ పాట బాలీవుడ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
అయితే ఇన్నాళ్లకు ఆ పొరపాటు సరిదిద్దబడిందని సునీతా రావు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షెర్లీ సింగ్ .. ఆమెకు చెందిన ఎంఆర్‌ఎం మ్యూజిక్ రైట్స్ కంపెనీ ప్రత్యేక చొరవతో ఈ తప్పిదాన్ని సరిచేశారని పేర్కొ న్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు యూట్యూబ్‌లోనూ తన పేరును సరైన అక్షరక్రమంతో క్రెడిట్‌గా చేర్చారని సంతోషం వ్యక్తం చేశారు.
సునీతారావు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పాట వీడియో క్లిప్‌ను షేర్ చేసారు `షెర్లీ సింగ్ , ఎంఆర్‌ఎం మ్యూజిక్ రైట్స్ సంస్థ చేసిన నిరంతర ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఎట్టకేలకు నా పేరును సరైన స్పెల్లింగ్‌తో క్రెడిట్స్‌లో చేర్చారని` సునీతా రావు రాసుకొచ్చారు. ఈ పాట ఎప్పుడూ ఓ క్రేజీ అండ్ ఫన్ ట్రాక్ గా అభివర్ణించారు. ఈ పొరపాటును సరిదిద్దిన బృందానికి సునీతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉమేష్ మెహ్రా దర్శకత్వంలో 1996లో తెరకెక్కిన `ఖిలాడీయోన్ కా ఖిలాడీ` చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అక్షయ్ కుమార్ `ఖిలాడీ` సిరీస్‌లో వచ్చిన నాల్గవ చిత్రమైన ఇది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ అతిపెద్ద బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇందులో అక్షయ్ కుమార్ సాహసోపేతమైన యాక్షన్ సీన్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ మ్యాడమ్ మాయా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో ప్రతికూల ఛాయలున్న పాత్రలో మెప్పించారు. `మేడమ్ ఎక్స్` సినిమా తర్వాత ఆమె నెగెటివ్ రోల్ చేయడం ఇదే రెండోసారి. అలాగే ఈ చిత్రంలో రవీనా టాండన్ కథానాయికగా నటించగా, ప్రసిద్ధ WWF (ప్రస్తుతం WWE) రెజ్లర్లు బ్రయాన్ ఆడమ్స్ (క్రష్), బ్రయాన్ లీ (ది అండర్‌టేకర్) కూడా కీలకమైన ఫైట్ సీన్లలో నటించి అలరించారు.
అను మాలిక్ స్వరపరిచిన `ఇన్ ది నైట్, నో కంట్రోల్` పాట రేఖ స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో పాటు సునీతా రావు విశిష్టమైన గొంతుతో అప్పట్లోనే శ్రోతలను అమితంగా ఆకట్టుకుంది. దశాబ్దాల తర్వాత అయినా ఈ పాటకు సంబంధించి గాయని సునీతా రావుకు దక్కాల్సిన సరైన గుర్తింపు లభించడంతో ఆమె అభిమానులు, సంగీత ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.