ట్రైల‌ర్ టాక్: లెజెండ్ స్పీల్‌బ‌ర్గ్ నుంచి నెవ్వ‌ర్ బిఫోర్ సైన్స్ ఫిక్ష‌న్ ట్రీట్!

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హాలీవుడ్ నటి, గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Update: 2026-05-28 12:44 GMT

హాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ చిత్రాల మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ మరోసారి తన అభిమాన జానర్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఏలియన్ థ్రిల్లర్ చిత్రం `డిస్‌క్లోజర్ డే` పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈటీ ది ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్, జురాసిక్ పార్క్ వంటి రికార్డులు తిరగరాసిన అద్భుతాలను అందించిన లెజెండ్ స్పీల్‌బర్గ్ నుండి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని ఆకాశానికి చేర్చింది. అడుగ‌డుగునా స‌స్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ర‌క్తి క‌ట్టిస్తున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హాలీవుడ్ నటి, గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎ క్వైట్ ప్లేస్, ఓపెన్‌హైమర్ వంటి చిత్రాలతో తన నటనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎమిలీ బ్లంట్ ఈ ఏలియన్ థ్రిల్లర్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త, అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. స్పీల్‌బర్గ్ మార్క్ విజువల్స్.. ఎమిలీ బ్లంట్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చెబుతోంది.

ఎమిలీ బ్లంట్‌తో పాటు ఈ భారీ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన స్టార్ కాస్టింగ్ భాగమైంది. `ది క్రౌన్` సిరీస్ ఫేమ్ జోష్ ఓకానర్.. ఆస్కార్ అవార్డు విజేత కోలిన్ ఫిర్త్ వంటి ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురు దిగ్గజ నటీనటుల కలయిక సినిమాపై ఉన్న హైప్‌ను మరింత రెట్టింపు చేసింది. స్పీల్‌బర్గ్ తన స్క్రిప్ట్‌కు అనుగుణంగా ఎంచుకున్న ఈ తారాగణం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం.

ఈ సినిమా కథాంశం, టెక్నికాలిటీస్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది కేవలం ఊహ‌కంద‌ని గ్రహాంతరవాసుల కథ మాత్రమే కాకుండా.. ఎమోషనల్ అండ్ హై-వోల్టేజ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్ వండర్‌గా అల‌రించ‌నుంది. ఐమాక్స్ స్క్రీన్లకు సరిపోయేలా అత్యంత అధునాతన విజువల్ ఎఫెక్ట్స్.. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్ల భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెండితెరపై గ్రహాంతరవాసుల ప్రపంచాన్ని స్పీల్‌బర్గ్ ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ `డిస్‌క్లోజర్ డే` చిత్రం 12 జూన్ 2026 న థియేటర్లలో.. ఐమాక్స్ స్క్రీన్లపై భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. వేసవి కానుకగా రానున్న‌ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా... సైన్స్ ఫిక్షన్ జానర్‌లో మరో గొప్ప‌ మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News