స్టార్ కిడ్స్ విషయంలో మారిన ట్రెండ్!
స్టార్ కిడ్స్‌లో చాలామంది యాక్టింగ్‌కే పరిమితం కాకుండా సినిమా, మ్యూజిక్, డైరెక్షన్ వంటి విభిన్న విభాగాల వైపు అడుగులేస్తున్నారు.
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు స్క్రీన్ పై హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఆనవాయితీగా ఉండేది. తమ ఫేవరెట్ హీరోకు కొడుకు పుడితే.. అతను ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు? ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడు? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేవారు. తండ్రి స్టార్‌డమ్‌ను వారసత్వంగా తీసుకుని అదే బాటలో ప్రయాణించడమే సహజమైన ఎంపికగా కనిపించేది. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. స్టార్ కిడ్స్‌లో చాలామంది యాక్టింగ్‌కే పరిమితం కాకుండా సినిమా, మ్యూజిక్, డైరెక్షన్ వంటి విభిన్న విభాగాల వైపు అడుగులేస్తున్నారు.
ఈ మారుతున్న ట్రెండ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ మంచి ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నాడు. విజయ్ కొడుకుగా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ భావించినప్పటికీ.. జేసన్ మాత్రం కెమెరా ముందు కంటే కెమెరా వెనుక పనిచేయడంపైనే ఆసక్తి చూపిస్తున్నాడు. డైరెక్షన్ పై ఫోకస్ పెట్టిన అతడు ఫిల్మ్ మేకింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే సినిమా ప్రాజెక్టులతో అనుబంధం ఏర్పరచుకున్న జేసన్.. తండ్రి అడుగుజాడల్లో హీరోగా కాకుండా తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
టాలీవుడ్ లోనూ ఇలాంటి పరిణామం కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కొడుకు మహాధన్ కూడా సినిమాకు సంబంధించిన పనుల్లో భాగమవుతూ ఫిల్మ్ మేకింగ్‌ను దగ్గరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నటుడిగా వెంటనే లాంచ్ కావడం కంటే.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో పనిచేస్తూ సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందో తెలుసుకోవడమే అతనికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయడం ద్వారా కథ నుంచి షూటింగ్ వరకు ఒక సినిమా నిర్మాణ ప్రక్రియపై ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం ఉంటుంది.
ఇక బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెద్ద కొడుకు హృహాన్ రోషన్ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి మరో దారిని ఎంచుకున్నాడు. 20 ఏళ్ల హృహాన్ ఇండిపెండెట్ మ్యూజిక్ జర్నీని స్టార్ట్ చేస్తూ, దిస్ హెవెన్లీ ప్లేస్ అనే సాంగ్ ను రిలీజ్ చేశాడు. ఈ ట్రాక్‌లో సింగర్‌గా, లిరిసిస్ట్‌గా, గిటారిస్ట్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. ఇవన్నీ చూస్తుంటే స్టార్ వారసత్వం ఉన్నంత మాత్రాన హీరోగానే కంటిన్యూ అవాలనే ఆలోచన కొత్త తరం స్టార్ కిడ్స్‌లో తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. తమకు నచ్చిన విభాగంలో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం పెరుగుతోంది. ఫ్యూచర్ లో ఈ ట్రెండ్ మరింత బలపడితే.. స్టార్ కిడ్స్ నుంచి హీరోలే కాకుండా డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది.