'మన్నత్' వెనుక దాగున్న చారిత్రక సినీ జ్ఞాపకాలు!

ముంబై నగరంలో పర్యాటకులను.. సినిమా అభిమానులను అమితంగా ఆకర్షించే ప్రదేశాలలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసం 'మన్నత్' ఒకటి.

Update: 2026-06-04 06:01 GMT

ముంబై నగరంలో పర్యాటకులను.. సినిమా అభిమానులను అమితంగా ఆకర్షించే ప్రదేశాలలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసం 'మన్నత్' ఒకటి. బాంద్రాలోని బాండ్‌స్టాండ్‌ తీరంలో ఉండే ఈ విలాసవంతమైన బంగ్లా ఒక నటుడి ఇల్లుగానే కాకుండా చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌గానూ నిలిచింది. అయితే ప్రస్తుత తరానికి ఇది షారుఖ్ ఖాన్ సామ్రాజ్యంగా మాత్రమే తెలిసినప్పటికీ దీని వెనుక ఓ ఆసక్తికర సినీ నేపథ్యం దాగి ఉంది. గత శతాబ్దపు 80, 90వ దశకాలలో ఈ భవనం బాలీవుడ్ చిత్రాల ప్రధాన లొకేషన్‌గా సేవలందించింది. ఎందరో అగ్ర నటులు ఇక్కడ కెమెరా ముందుకొచ్చి తమ నటనను ప్రదర్శించారు.

ఈ చారిత్రక భవనంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల పంచుకున్న జ్ఞాపకాలు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా మారాయి. షారుఖ్ ఖాన్ ఈ బంగ్లాను కొనుగోలు చేసి, దానికి `మన్నత్` అని పేరు పెట్టడానికి ముందే తాను అక్కడ ఎన్నో రోజులు గడిపానని వెల్లడించారు. ఆ ప్రదేశంలోని ప్రతి అంగుళం తనకు ఎంతో సుపరిచితమని.. అక్కడి డ్రాయింగ్ రూమ్‌లో ఎన్నో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో తాను భాగమయ్యానని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. ఒకప్పటి షూటింగ్ స్పాట్ నేడు ఒక సూపర్ స్టార్ నివాసంగా ఎలా మారిందో? ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.

1990వ దశకం ఆరంభంలో బాలీవుడ్‌ను ఊపేసిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఈ లొకేషన్‌లోనే రూపొందాయి. దర్శకుడు ఇంద్ర కుమార్ తెర‌కెక్కించిన `దిల్` (1990) , `బేటా` (1992) వంటి భారీ విజయాలు సాధించిన సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. నటి మాధురీ దీక్షిత్ కథానాయికగా నటించిన ఈ చిత్రాలలో అమీర్ ఖాన్, అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలు నటించారు. ఈ సినిమాలోని అనేక లగ్జరీ ఇండోర్ సన్నివేశాలను ఆనాటి ఈ విశాలమైన బంగ్లాలోనే ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

ఈ రెండు సినిమాలే కాదు. `బోల్ రాధా బోల్` వంటి మరికొన్ని ప్రజాదరణ పొందిన హిందీ చిత్రాలు కూడా ఇదే భవనంలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. అయితే ఇక్కడ మరో కాకతాళీయ అంశం ఏమిటంటే? షారుఖ్ ఖాన్ ఈ ఇల్లు కొనడానికి ముందే ఆయన నటించిన `యెస్ బాస్` (1997) చిత్రంలోని ఓ ప్రసిద్ధ పాటలో ఈ భవనం బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది. ఆ తర్వాతే షారుఖ్ ఈ సముద్రతీర బంగ్లాను సొంతం చేసుకుని కుటుంబంతో కలిసి స్థిరపడ్డారు. కాలక్రమంలో ఈ కట్టడం ఒక వ్యక్తిగత నివాసంగా మారిపోయి సరికొత్త రూపు సంతరించుకుంది.

ఈ లొకేషన్ జ్ఞాపకాలతో పాటు.. షారుఖ్ ఖాన్‌తో తనకున్న ఆత్మీయ బంధాన్ని కూడా అనుపమ్ ఖేర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే`, `చాహత్`, `కుచ్ కుచ్ హోతా హై` వంటి చిత్రాలు భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్‌లుగా నిలిచిపోయాయి. ఆయా సినిమాల్లో వారి మధ్య పండిన హాస్యం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. తోటి నటులతో .. పాత లొకేషన్లతో ఉండే ఇలాంటి అనుబంధాలు బాలీవుడ్ స్వర్ణయుగపు సృజనాత్మక వాతావరణాన్ని గుర్తుచేస్తాయి.

ప్రస్తుతం మ‌న్న‌త్ కట్టడం ఆధునీకరణ పనుల నిమిత్తం తాత్కాలికంగా పునర్నిర్మాణంలో ఉన్నప్పటికీ అభిమానుల్లో దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇలాంటి పాత జ్ఞాపకాలను సీనియర్ నటులు పంచుకున్నప్పుడు, సినీ పరిశ్రమ ప్రయాణాన్ని సరికొత్త కోణంలో అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు కేవలం సినిమా సెట్‌గా వాడబడిన ఒక ఇల్లు, నేడు కోట్లాది మంది ఆరాధించే ఒక నటుడి చిరునామాగా మారడం సినిమా ప్రపంచంలోని అద్భుతమైన పరిణామ క్రమానికి అద్దం పడుతోంది.

Tags:    

Similar News