దొంగల్ని పట్టేసిన యజమాని!
`కేజీఎఫ్` చిత్రంతో పాన్-ఇండియా లో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి సినిమాల్లోకి రాకముందు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసిన సంగతి చాలామందికి తెలియదు.
`కేజీఎఫ్` చిత్రంతో పాన్-ఇండియా లో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి సినిమాల్లోకి రాకముందు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసిన సంగతి చాలామందికి తెలియదు. ఇటీవల సంభాషణలో తన పాత ఉద్యోగ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అమ్మడు కంపెనీలో పనిచేసిన చోట నమ్మకద్రోహం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో వివరించారు. కంపెనీ యజమాని చూపిన ఉదారతను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సంస్థ సొమ్మును కొల్లగొట్టిన దొంగల ఉదంతాన్ని నిధి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సినిమాల్లో నటిగా మారకముందు శ్రీనిధి ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేసేవారు. ఆ సమయంలో తమ కంపెనీ బాస్ ఉద్యోగులపై ఎంతో నమ్మకం ఉంచి పెద్ద ఎత్తున బాధ్యతలను అప్పగించేవారట. అయితే యజమాని ఉంచిన ఆ నమ్మకాన్ని కొందరు స్వార్థపూరిత ఉద్యోగులు తమ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారుట. బాస్ కళ్లలోనే కారం కొట్టి కంపెనీకి సంబంధించిన భారీ మొత్తంలో డబ్బును తమ సొంత ఖాతాలకు మళ్లిస్తూ శఠగోపం పెట్టారని శ్రీనిధి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
సంస్థలో లావాదేవీలు తేడా రావడం, ఆర్థిక వ్యత్యాసాలు స్పష్టంగా కనిపించడంతో యజమానికి అనుమానం వచ్చి అంతర్గతంగా లోతుగా విచారణ చేపట్టారు. దాంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. తమను నమ్మి ప్రాధాన్యత ఇచ్చిన యజమానికే వెన్నుపోటు పొడిచిన ఆ దొంగల అసలు స్వరూపం బయటపడింది. యజమాని తీవ్ర అగ్రహానికి గురై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మోసపూరిత ఉద్యోగులను తక్షణమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారని శ్రీనిధి తెలిపారు.
శ్రీనిధికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా వృత్తిపరమైన జీవితానికి పెద్ద పాఠాన్ని నేర్పిందని చెప్పారు. నమ్మకాన్ని ఒమ్ము చేయడం ద్వారా తాత్కాలికంగా కొంత డబ్బు సంపాదించినా? చివరికి పట్టుబడితే కెరీర్, పరువు, సమాజంలో గౌరవం అన్నీ ఒక్కసారే తుడిచిపెట్టుకుపోతాయనే చేదు నిజం ఆ ఉద్యోగుల తొలగింపు ద్వారా తనకు స్పష్టంగా అర్థమైందన్నారు.
కార్పొరేట్ రంగంలోనైనా లేదా పరిశ్రమలోనైనా క్రమశిక్షణ, నిజాయితీ మాత్రమే వ్యక్తిని సుదీర్ఘకాలం నిలబె డతాయని శ్రీనిధి అభిప్రాయపడ్డారు. యజమానులు ఇచ్చే అవకాశాలను, నమ్మకాన్ని, చూపే గౌరవాన్ని కాపాడు కోకుండా స్వార్థంతో ప్రవర్తిస్తే పతనం చాలా దారుణంగా ఉంటుందని చెప్పడానికి మాజీ కంపెనీలో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.
నాటి ఉద్యోగ జీవితంలో చూసిన ఇటువంటి అనుభవాలు, నేడు సినీ రంగంలో పరిణతి చెందిన నటిగా ముందడుగు వేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయని శ్రీనిధి స్పష్టం చేశారు. జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎంతవరకు హద్దులు ఉండాలో అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన ఒక మార్గదర్శకంగా నిలిచిందన్నారు. యజమానిని మోసం చేసిన ఆ ఇంటి దొంగల ఉదంతం, నమ్మకద్రోహానికి ఒడిగడితే కాలం ఎప్పటికైనా తగిన గుణపాఠం చెబుతుందనే సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.