పుష్ప, పాధగట్టం.. ఆ స్పేస్ ను వాడుకుంటున్న శ్రీవిష్ణు

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్ పై స్పూఫ్ లు చేసి కామెడీ పండించే ట్రెండ్ ఎక్కువగా ఉండేది.

Update: 2026-10-09 05:05 GMT

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్ పై స్పూఫ్ లు చేసి కామెడీ పండించే ట్రెండ్ ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఆ రూట్లో హిట్టు కొట్టిన సందర్భాలు ఎక్కువే. అయితే కాలానుగుణంగా ఆ ఫార్ములాను పక్కనపెట్టేశారు. కానీ ఇప్పుడు ఆ స్పేస్ ను శ్రీ విష్ణు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన సినిమాల్లో బలవంతంగా స్పూఫ్ సీన్స్ ఇరికించకుండా, సిచువేషన్ కు తగ్గట్లుగా పాపులర్ డైలాగ్స్ తో సెటైర్లు వేస్తూ కొత్త తరహా కామెడీని పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.

లేటెస్ట్ గా కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో కూడా మేకర్స్ ఇదే ఫార్ములాను నమ్మున్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు తన మీద తానే వేసుకునే సెల్ఫ్ పంచ్ లతో పాటు ఇండస్ట్రీపై వేసిన సెటైర్లను ఇందులో గట్టిగానే వాడుకున్నారు. నక్సలైట్ల మధ్య చిక్కుకున్న హీరోను ఏ దళం రా నీది అని అడిగినప్పుడు, ఆచార్య దళం అని సమాధానం చెప్పడం ఈ కోవలోకే వస్తుంది. ఆ దళం ఎక్కడ ఉందని అడిగితే ధర్మస్థలికి పాదఘట్టానికి మధ్యలో ఉంటుందని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ సినిమాలో హైలైట్ గా నిలిచేలా రాసుకున్నారు.

ఆచార్య మాత్రమే కాదు, పుష్ప రిఫరెన్స్ ను కూడా దర్శకుడు ఈ సినిమాలో వాడాడు. శ్రీకాంత్ అయ్యర్ ఓ సీన్ లో ఇంతకుముందు ఎవరి దగ్గర పని చేశావ్ అని వెన్నెల కిషోర్ ను అడుగుతాడు. దానికి కిషోర్ మన అటవీ శాఖ మంత్రి ముల్లేటి పుష్పరాజ్ అని సమాధానం చెబుతాడు. ఈ సెటైరికల్ కామెడీకి కమెడియన్ సత్య ట్రాక్ తోడవడంతో ఫన్ డోస్ మరింత పెంచేలా ప్లాన్ చేశారు.

శ్రీ విష్ణు, సత్య కాంబినేషన్ లో వచ్చే సీన్లను ప్రధాన బలంగా మలుచుకున్నారు. ముఖ్యంగా సత్య రాసే ఇంగ్లీష్ లవ్ లెటర్ సీన్ ఈ సినిమాకే ఒక హైలెట్ అయ్యేలా మేకర్స్ డిజైన్ చేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే టైమింగ్ కామెడీపైనే సినిమా భారం ఎక్కువగా మోపినట్లు తెరపై చూస్తే అర్థమవుతుంది.

నిజానికి ఒక సీరియస్ నక్సల్ బ్యాక్ డ్రాప్ కథలో కామెడీని చొప్పించడం అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్న పనే. కథలోని సీరియస్ నెస్ దెబ్బతినకూడదు, అలాగని ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు. బహుశా అందుకే దర్శకుడు ఈ తరహా రిఫరెన్స్ లను ఎంచుకుని ఉండొచ్చు. పెద్ద సినిమాల్లోని పదాలను పక్కా టైమింగ్ తో ప్రెజెంట్ చేస్తే ఆడియన్స్ కు వెంటనే ఆ కనెక్షన్ దొరుకుతుందనేది వాళ్ల ఆలోచన. ఈ ప్రయోగాన్ని శ్రీ విష్ణు తన మార్క్ డెలివరీతో నడిపించాడు. కామ్రేడ్ కళ్యాణ్ తో శ్రీ విష్ణు మరోసారి తన రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ మీటర్ ను ఫాలో అయ్యాడు.

రొటీన్ కామెడీ ట్రాక్స్ కు భిన్నంగా ఇలా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ ను సినిమాల్లో వాడటం టాలీవుడ్ కు ఒక రకంగా పాత ఫార్ములాను కొత్తగా చూపించడమే. అయితే ఇండస్ట్రీ సెటైర్లు, సెల్ఫ్ పంచ్ లతో నింపిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఈ దసరా వీకెండ్ లో పోటీగా పెద్ద సినిమాలు లేవు. రావాల్సిన ఆదర్శ కుటుంబం వాయిదా పడడంతో పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా శ్రీ విష్ణు హైలెట్ అవుతున్నాడు. మరి కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News