ఎస్.జాన‌కి అంత‌ర్థానం.. మైసూరు నుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ర‌కూ క‌ళాకారుల నివాళి!

జాన‌కి కళా సేవలకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.

Update: 2026-07-12 08:56 GMT

భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని `దక్షిణాది కోకిల`గా పిలుపు అందుకున్న‌ ఎస్. జానకి (జానకమ్మ) శనివారం (11 జులై 2026) రాత్రి మైసూరులోని అపోలో బీజీఎస్ ఆసుపత్రిలో వృద్ధాప్య సమస్యలు, గుండెపోటు కారణంగా కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేటి గాయ‌ని వయసు 88 ఏళ్లు. జానకమ్మ మరణవార్తతో కోట్లాది మంది సంగీతాభిమానులు, సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

జాన‌కి కళా సేవలకు గుర్తింపుగా కర్ణాటక ప్రభుత్వం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఎస్.జాన‌కి భౌతికకాయాన్ని మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో.. ట్రాఫిక్ నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయని మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమా లత్కర్ తెలిపారు.

1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఎస్. జానకి.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంతో పాటు దాదాపు 20కి పైగా భాషల్లో 48,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. జానకి కి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన వాయిస్ మోడ్యులేషన్ (కంఠస్వరాన్ని మార్చడం) ద్వారా ఆమె పసిపిల్లల గొంతుతో, జానపద శైలిలో, శాస్త్రీయ రాగాల్లో ఇలా ఏ పాత్రకైనా అద్భుతంగా ప్రాణం పోసేవారు. అందుకే ఆమెను `భావగాయని` అని పిలిచేవారు.

జాన‌కి అద్భుత గానానికి గానూ 4 జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రికార్డు స్థాయిలో 33 రాష్ట్ర చలనచిత్ర అవార్డులు లభించాయి. అలాగే మైసూరు విశ్వవిద్యాలయం జాన‌కిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఆమె సున్నితంగా తిరస్కరించారు. దక్షిణాది కళాకారులకు చాలా ఆలస్యంగా గుర్తింపు లభిస్తోందని, ఈ పురస్కారం తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని ఆమె నాడు అభిప్రాయపడ్డారు. 2016లో జాన‌కి పాటలు పాడటం నుంచి విరమణ తీసుకుని, మైసూరులోనే ప్రశాంత జీవితాన్ని గడిపారు.

జానకి మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసందర్శన అనంతరం, ఆదివారం సాయంత్రం మైసూరులోని కనియనహుండిలో ఉన్న ఆమె ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. జానకమ్మ మ‌న‌ల్ని వీడి వెళ్లినా త‌న స్వ‌రం హృద‌యాల్లో ల‌య‌లా నాటుకునే ఉంది.. ఆమె పాడిన వేలాది అమరగానాలు తరతరాల సంగీతాభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.

విజయనగరం సాంస్కృతిక సంస్థల నివాళి:

గాయని ఎస్. జానకి అంత‌ర్థాన‌మైన వేళ‌.. ఆంధ్రప్రదేశ్‌లోని క‌ళాత్మ‌క‌- చారిత్రక నగరమైన విజయనగరానికి చెందిన పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. జానకమ్మ ఇహ‌లోకాన్ని వీడి వెళ్లినా ఆమె గానాలాప‌న‌.. వేలాది పాట‌ల స్వ‌ర‌లాలిత్యంతో ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారని వారు కొనియాడారు.

గతంలో విజయనగరంలో జరిగిన పలు సంగీత కచేరీలలో జానకి పాల్గొన్న సందర్భాలను, ఆ సమయంలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని స్థానిక కళాకారులు, నిర్వాహకులు ఈ సందర్భంగా ఎంతో గర్వంగా, భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. విజయనగర సాంస్కృతిక వైభవంలో జాన‌కి గొంతుక ఒక చెరగని ముద్ర వేసిందని.. ఆమె సంగీత వారసత్వం తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News