గంగూలీ బయోపిక్: నగ్మాతో లవ్ ఎపిసోడ్స్‌పైనే కుతూహలం
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.;
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. తాజాగా ఈ బయోపిక్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.`దాదా: ద సౌరవ్ గంగూలీ స్టోరీ` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్ పోషిస్తున్నారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో లవ్ రంజన్ - అంకుర్ గార్గ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. గంగూలీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు నటి నగ్మాతో సాగించిన ప్రేమాయణం ఈ సినిమాలో ఉంటుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలో గంగూలీకి నగ్మా ఇచ్చే ఫ్లయింగ్ కిస్సులు.. వారిద్దరి మధ్య నడిచిన తెరవెనుక ఎపిసోడ్స్‌ను సినిమాలో ఉన్నదున్నట్టు చూపిస్తారా? మసాలా దట్టిస్తారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజ్‌కుమార్ రావు సరసన నగ్మా పాత్రలో ఏ నటి కనిపిస్తుందనే విషయంపైనా మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కేవలం మైదానంలో గంగూలీ సాధించిన విజయాలు లేదా బీసీసీఐతో ఆయనకు ఉన్న సంబంధాల గురించి మాత్రమే చూపిస్తే సరిపోదు. గంగూలీలోని `లవర్ బాయ్` యాంగిల్‌ను, ముఖ్యంగా నగ్మాతో ముడిపడిన వివాదస్పద , ఆసక్తికర అంశాలను చూపిస్తేనే సినిమాకు ప్రపంచవ్యాప్త ఫాలోవర్ల నుండి మంచి స్పందన వస్తుంది. కేవలం స్ఫూర్తినిచ్చే విషయాలకే పరిమితం కాకుండా కొంచెం మసాలా హంగులు కూడా జోడిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ పాత్ర కోసం రాజ్‌కుమార్ రావు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. గంగూలీలా కనిపించేందుకు ఆయన గత ఆరు వారాలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. అంతకుముందు ఒక ప్రాజెక్ట్ కోసం పెరిగిన బరువును తగ్గించుకుని.. అథ్లెటిక్ బాడీ మేకోవర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ సెట్స్ నుండి క్లాపర్ బోర్డ్ ఫోటోలను పంచుకుంటూ రాజ్‌కుమార్ రావు షూటింగ్ ప్రారంభాన్ని ధృవీకరించారు. స్వయంగా గంగూలీ కూడా రాజ్‌కుమార్ రావు తన పాత్రకు సరైన ఎంపిక అని ప్రశంసించడం విశేషం.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గంగూలీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రూపురేఖలు ఎలా మారాయి? యువ క్రికెటర్లను ఆయన ఎలా ప్రోత్సహించారు? అనే అంశాలతో పాటు వ్యక్తిగత జీవితంపైనా సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. షూటింగ్ ఇప్పుడే ప్రారంభమైనందున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. రాజ్‌కుమార్ రావు నటిస్తున్న మరో చిత్రం `రఫ్తార్`జూలై 2026లో విడుదల కానుండటంతో `దాదా`పూర్తయ్యే సమయం, విడుదల తేదీపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.