పరివర్తన దిశగా రజనీకాంత్ కుటుంబం!

సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ సౌందర్య రజనీకాంత్ త‌న వ్యక్తిగత జీవితం, వివాహం మరియు కుటుంబ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-10-07 16:53 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె, ద‌ర్శ‌క‌, నిర్మాత‌ సౌందర్య రజనీకాంత్ త‌న వ్యక్తిగత జీవితం, వివాహం మరియు కుటుంబ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌంద‌ర్య‌ మొదటి వివాహ బంధం ముగిసి విడాకులు తీసుకున్న కష్టకాలంలో త‌న తల్లిదండ్రులు కొండంత అండగా నిలిచారని ఎమోష‌న‌ల్ అయ్యారు. తల్లిదండ్రుల సహకారం లేకపోతే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటం తనకు సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు.

ఏ అమ్మాయికైనా జీవితంలో మొదటి పురుషుడు తండ్రేనని, మొదటి స్నేహితురాలు తల్లి అని సౌందర్య వ్యాఖ్యానించారు. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఆ బంధం మరింత బలపడుతుందని తెలిపారు. విడాకుల సమయంలో రజనీకాంత్ , లత దంపతులు కొండంత ధైర్యాన్ని ఇచ్చార‌న్నారు. మొదటి వివాహం విఫలమై నప్పటికీ వివాహ వ్యవస్థపై తనకున్న నమ్మకం సడలలేదని, అది కేవలం తప్పుడు బంధం మాత్రమేనని అర్థం చేసుకున్నానన్నారు. కోలుకోవడానికి సమయం తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి తాను ఎంతో ఉత్సాహంగా వేచి చూశానని.. ప్రస్తుతం వ్యాపారవేత్త విశాగన్ వణంగముడితో రెండో వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.

ఇదే సమయంలో తమ కుటుంబంలో ఉన్న పురుషాధిక్యత ధోరణి గురించి కూడా సౌందర్య ఓపెన్‌గా మాట్లాడారు. తమ తరంలో చాలామంది ఇళ్లల్లో పురుషాధిక్యతే ఉండేదని.. తమ ఇంట్లో కూడా అదే పరిస్థితులు ఉండేవని ఒప్పు కున్నారు. అయితే కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చిందని సౌందర్య వెల్లడించారు. వయస్సు పెరిగే కొద్దీ ప్రేమ, తోడు అనే భావనలపై అవగాహన మారుతుందని, 20 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రేమ భావన 40 ఏళ్లకు వచ్చేసరికి ఒకేలా ఉండదని, తన తల్లిదండ్రుల విషయంలో కూడా అదే జరిగిందని వివరించారు.

ప్రస్తుతం తమ ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయని, రజనీకాంత్ , లత దంపతులు పరస్పరం అనుబంధాన్ని మరింత కొత్తగా ఆస్వాదిస్తున్నారని తెలిపారు. తమ వివాహ బంధంలో సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, భార్యాభర్తలిద్దరూ సగం సగం బాధ్యతలు పంచుకోవాలనే నియమాన్ని తాము పాటిస్తున్నామని చెప్పారు. ఏ ఒక్కరి నిర్ణయమే చెల్లాలనే ధోరణి కాకుండా ఇద్దరం కలిసే ప్రతి నిర్ణయం తీసుకుంటామని సౌందర్య వివరించారు.

ఇంట్లోని పురుషాధిక్యత వాతావరణం గతంలో ఉన్నా? ఇప్పుడు అది మారుతుండటం ఎంతో సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. కాలంతో పాటు మనుషులు, వారి ఆలోచనలు మారడమే ఆరోగ్యకరమైన కుటుంబానికి సంకేతమని సౌందర్య పేర్కొన్నారు. ఒకప్పుడు సాంప్రదాయక మైండ్ సెట్‌తో ఉన్న రజనీకాంత్ దంపతులు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారని సౌందర్య చెప్పిన మాటలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక వృత్తి విష‌యానికి వ‌స్తే సౌందర్య రజనీకాంత్ సినీ నిర్మాణ రంగంలో కీలక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తాజాగా దర్శకుడు బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకవైపు నిర్మాతగా వరుస చిత్రాలను ప్లాన్ చేస్తూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ సమానత్వం, గౌరవంతో కూడిన బంధాన్ని కొనసాగిస్తూ ముందడుగు వేస్తున్నారు.

Tags:    

Similar News