ముంబైలో కోట్ల‌లో అద్దెలు వెన‌కేసుకుంటున్న తెలుగు న‌టి

అధికారిక పత్రాల ప్రకారం.. కువైట్ కాన్సులేట్ జనరల్ ఇమాద్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరాజ్.. ఆయన కుటుంబ సభ్యులు.. సిబ్బంది నివాస వసతి కోసం ఈ లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు.

Update: 2026-05-30 02:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు, పారిశ్రామిక రంగానికి కేంద్రబిందువైన ముంబై నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా లో ఉన్న ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ ఏకంగా రూ. 1.92 కోట్ల భారీ మొత్తానికి ఒక ఏడాది కాలానికి లీజుకు ఇవ్వడం చ‌ర్చ‌గా మారింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వివ‌రాల ప్ర‌కారం.. బాంద్రా వెస్ట్ లోని తెలుగు న‌టి త‌న అపార్ట్‌మెంట్‌ను స్టేట్ ఆఫ్ కువైట్ కాన్సులేట్ జనరల్ సంస్థకు లీజుకు ఇవ్వ‌డం విశేషం.

అధికారిక పత్రాల ప్రకారం.. కువైట్ కాన్సులేట్ జనరల్ ఇమాద్ అబ్దుల్ అజీజ్ అల్-ఖరాజ్.. ఆయన కుటుంబ సభ్యులు.. సిబ్బంది నివాస వసతి కోసం ఈ లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. బాంద్రా వెస్ట్‌లోని అత్యంత విలాసవంతమైన `81 ఆరియేట్` భవనంలో ఒక అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. దాదాపు 4,350 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో పాటు 27 చదరపు అడుగుల సర్వెంట్స్ టాయిలెట్ ఏరియాను ఈ ఫ్లాట్ కలిగి ఉంది. ఈ హై-ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ లావాదేవీ25 మే 2026న రిజిస్టర్ అయిన‌ట్టు స‌మాచారం.

ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి నెలవారీ అద్దె అక్షరాలా రూ. 16 లక్షలుగా నిర్ణయించారు. 12 నెలల కాలపరిమితితో కూడిన ఈ లీజు ఒప్పందం 7 జూన్ 2026 నుండి ప్రారంభమై 2027 జూన్ లో ముగియనుంది. ఈ ఫ్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లను కూడా కేటాయించారు. ఈ అంతర్జాతీయ స్థాయి భవన స్థ‌లంలో అత్యాధునిక జిమ్నాజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్, మహిళలు- పురుషులకు విడివిడిగా రెండు స్విమ్మింగ్ పూల్స్, రన్నింగ్ - జాగింగ్ ట్రాక్స్, బ్యాంక్వెట్ హాల్, మూడు ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, యోగా స్టూడియో, ఓపెన్ స్కై ఫిట్‌నెస్ సెంటర్, కిడ్స్ ప్లే ఏరియా, క్లబ్‌హౌస్ వంటి ఎన్నో ప్రపంచ స్థాయి వసతులు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకున్నందుకు టెనెంట్ అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముంబైలోని సౌత్ ముంబై పరిధిలో ఉన్న చర్చ్ గేట్ ఏరియా, ప్రఖ్యాత కేసీ కాలేజీ సమీపంలో కువైట్ కాన్సులేట్ కార్యాలయం ఉండగా.. అధికారుల‌ నివాస అవసరాల కోసం బాంద్రాలోని ఈ లగ్జరీ ఫ్లాట్‌ను ఎంచుకోవడం గమనార్హం. సాధారణంగా అంతర్జాతీయ దౌత్యవేత్తలు, విదేశీ రాయబార కార్యాలయాల అధికారులు ముంబైలో నివసించడానికి ఇలాంటి అత్యంత భద్రత, విలాసవంతమైన వసతులు ఉన్న ప్రైమ్ లొకేషన్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తాజా ఒప్పందం ముంబైలోని లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ క్రేజ్ .. దానికి ఉన్న అంతర్జాతీయ డిమాండ్‌ను మరోసారి నిరూపించింది. అయితే స‌ద‌రు న‌టీమ‌ణికి ముంబైలో ఇలాంటి చాలా అపార్ట్ మెంట్లు ఉన్నాయి. కొన్నిటి నుంచి ల‌క్ష‌ల్లో అద్దెలు అందుకుంటున్నారు. ఏడాదికి కోట్లలో కేవ‌లం అద్దెల రూపంలో వ‌సూల‌వుతోంద‌ని స‌మాచారం. న‌టిగా ఆర్జ‌న వేరు.. స్థిరాస్థి రంగంలో తెలివైన పెట్టుబ‌డుల‌తో సంపాదించ‌డం వేరు. ఇది అద‌న‌పు ఆదాయం. ఈ త‌ర‌హాలో ముంబై, హైద‌రాబాద్ కి చెందిన చాలా మంది స్టార్లు అద్దెల మీద‌ భారీగా ఆర్జిస్తున్నారు. ఈ న‌టి ఎవ‌రో ఇప్ప‌టికైనా క‌నిపెట్టారా? క్లూ ప్ర‌కారం.. ర‌జ‌నీకాంత్ `లింగా` చిత్రంలో న‌టించింది. న‌ట‌వార‌సురాలిగా సుప‌రిచితురాలు!

Tags:    

Similar News