కూర్మావతార్ టీజర్ టాక్: దేవుడు vs ఇప్పటి రాక్షసులు
శివరాజ్ కుమార్ పాత్రను ఎక్కువగా యాక్షన్ వైపే చూపించారు. చేతిలో త్రిశూలం, గంభీరమైన లుక్‌తో ఆయన కనిపించే సీన్స్ ఉన్నాయి. ఆయన పాత్రలో ఏదో రహస్యం ఉన్నట్లు అనిపిస్తోంది.
శివరాజ్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ తరుణ్, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రల్లో వస్తున్న సినిమా ‘కూర్మావతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. పేరు చూస్తే పూర్తిగా పురాణాల చుట్టూ తిరిగే సినిమా అనిపించినా, టీజర్ మాత్రం ఇప్పటి సమాజంలో జరిగే కొన్ని విషయాలకు మైథలాజికల్ టచ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. భూమిపై చెడు పెరిగిపోయినప్పుడు మహావిష్ణువు ఏదో ఒక రూపంలో రంగంలోకి దిగుతాడనే పాయింట్‌తో కథను మొదలుపెట్టారు.
విష్ణువు దశావతారాల్లో కూర్మావతారం అంటే తాబేలు రూపం. అదే గుర్తును టీజర్‌లో చాలాచోట్ల వాడారు. కొన్ని షాట్స్‌లో తాబేలు ఆకారాన్ని నేరుగా చూపిస్తే, మరికొన్ని చోట్ల దాన్ని కథలో ఒక సంకేతంలా పెట్టారు. కూర్మావతారాన్ని తీసుకుని కొత్త కథ రాసినట్టు అనిపిస్తోంది. అసలు విష్ణువు పాత్ర ఈ కథలో ఎలా ఎంటర్ అవుతుంది అన్నది మాత్రం టీజర్ దాచేసింది.
శివరాజ్ కుమార్ పాత్రను ఎక్కువగా యాక్షన్ వైపే చూపించారు. చేతిలో త్రిశూలం, గంభీరమైన లుక్‌తో ఆయన కనిపించే సీన్స్ ఉన్నాయి. ఆయన పాత్రలో ఏదో రహస్యం ఉన్నట్లు అనిపిస్తోంది. చెప్పిన డైలాగ్స్ చూస్తుంటే పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నట్లు అర్థమవుతుంది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ కూడా యాక్షన్ డోస్ తో ఉంది. సాయి కుమార్ వాయిస్ ఓవర్ తోనే టీజర్ హైలెట్ అవ్వగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ కథలో రాక్షసులు అంటే పురాణాల్లో కనిపించే రూపాలు మాత్రమే కాదనే భావన కూడా కనిపిస్తోంది. స్వార్థం, దుర్బుద్ధి, అధికార దాహం పెరిగిన మనుషులనే మరో రూపంలో చూపించే ప్రయత్నం చేసినట్టు కొన్ని సన్నివేశాలు చెబుతున్నాయి. పురాణాన్ని ఇప్పటి సమస్యలతో కలపడం కొత్త ధనమే. ఇక సినిమాలో అది ఎంతవరకు కుదిరిందో తెలియాలంటే సినిమా వచ్చిన తర్వాతే తెలుస్తుంది.
విజువల్స్ విషయంలో టీజర్ మొత్తం ఒకే టోన్‌లో వెళ్లింది. చీకటి బ్యాక్‌డ్రాప్స్, పెద్ద సెట్స్, యుద్ధానికి సంబంధించిన షాట్స్ ఎక్కువగా ఉన్నాయి. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హై వోల్టేజ్ అనేలా ఉంది. మ్యూజిక్ మైథలాజికల్ సెటప్‌కు సరిపోయేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగానే కుదిరాయి. సినిమా ఒక పెద్ద బడ్జెట్ ఫాంటసీగా తెరకెక్కినట్లు ఒక క్లారిటీ ఇచ్చారు.
పూజిత కె, నరేంద్ర కొండ, కె సేవిత రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. టీజర్‌తో కథ ప్రపంచాన్ని పరిచయం చేసిన టీమ్, తర్వాత పాత్రల వివరాలు లేదా ట్రైలర్ ద్వారా అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్స్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.