ఒరిజినల్స్ పై టాలీవుడ్ ఆశలు.. ఏం చేస్తాయో?

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మళ్లీ ఒరిజినల్‌ తెలుగు సినిమాలపై ఆశలు పెరుగుతున్నాయి;

Update: 2026-03-31 01:30 GMT

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మళ్లీ ఒరిజినల్‌ తెలుగు సినిమాలపై ఆశలు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా రీమేక్‌ లు, డబ్‌ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు లోకల్ కంటెంట్‌ పైనే ఇండస్ట్రీ దృష్టి సారించింది. అందుకే వీకెండ్ లో విడుదలకు సిద్ధమవుతున్న రెండు ఒరిజినల్‌ తెలుగు చిత్రాలు బైకర్‌, రాకాస పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కొద్ది రోజుల క్రితం రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. మరొకటి హిందీ నుండి డబ్‌ చేసి విడుదల చేసిన ధురంధర్‌ 2. ఉస్తాద్ భగత్ సింగ్.. కోలీవుడ్ మూవీ తేరి రీమేక్ కాదని మేకర్స్ చెబుతున్నప్పటికీ.. ఆడియన్స్ మాత్రం రీమేక్ అని అంటున్నారు. ఏదేమైనా ఆ రెండు సినిమాలు విడుదలైన తొలి వారం మంచి వసూళ్లు సాధించి, థియేటర్లలో సందడి చేశాయి.

ముఖ్యంగా స్టార్‌ క్యాస్టింగ్‌, భారీ ప్రచారం కారణంగా మంచి ఓపెనింగ్స్‌ సాధించాయి. అయితే మొదటి వారం తర్వాత ఉస్తాద్ కలెక్షన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తదనం లేకపోవడం వంటి కారణాలతో ప్రేక్షకులు అంతా ఇప్పుడు మరింత కొత్త అనుభవాన్ని కోరుకుంటున్నారని చెప్పాలి. దీంతో టాలీవుడ్‌ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒరిజినల్‌ కథలపై ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభించారు.

అదే సమయంలో ఏప్రిల్‌ 3న విడుదల కానున్న బైకర్‌, రాకాస సినిమాలు ఇండస్ట్రీకి కొత్త ఊపు తీసుకురావాలని అంతా ఆశిస్తున్నారు. ఆ రెండు సినిమాలు పూర్తిగా తెలుగు కథలతో రూపొందినవిగా ప్రచారం పొందుతున్నాయి. ముఖ్యంగా యూత్‌, మాస్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేలా కథ, స్క్రీన్‌ ప్లే ఉండబోతున్నాయని చిత్రబృందాలు చెబుతున్నాయి.

బైకర్‌ చిత్రం యాక్షన్‌, ఎమోషన్‌ ఎలిమెంట్స్ తో రూపొందిందని సమాచారం. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంతో పాటు యూత్ లైఫ్స్ ను రిఫ్లెక్ట్ చేసే అంశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ట్రైలర్‌, టీజర్లకు ఇప్పటికే మంచి స్పందన రావడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. మరోవైపు రాకాస మూవీ థ్రిల్లర్‌ జానర్‌ లో తెరకెక్కినట్టు టాక్‌. సస్పెన్స్‌, ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కథ ఉండబోతుందని చిత్ర యూనిట్‌ పేర్కొంటోంది.

ఇటీవల కాలంలో ప్రేక్షకులు కేవలం స్టార్‌ పవర్‌ కంటే మంచి కథ, కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒరిజినల్‌ కంటెంట్‌ తో వస్తున్న సినిమాలకు మంచి అవకాశం ఉందని చెప్పాలి. అదే సమయంలో థియేటర్ల యజమానులు కూడా ఆ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొత్త కంటెంట్‌ కోసం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అలా వీకెండ్ లో విడుదల కానున్న రెండు సినిమాలపై ఇండస్ట్రీ మొత్తం కన్నేసింది. మరి అవి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News