శంకర్ + మురగదాస్ మాస్టర్ ప్లాన్?
కోలీవుడ్ సంచలన దర్శకులు శంకర్..మురగదాస్ పరిశ్రమకు ఎలాంటి విజయాలు అందించారో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కోలీవుడ్ సంచలన దర్శకులు శంకర్..మురగదాస్ పరిశ్రమకు ఎలాంటి విజయాలు అందించారో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ విజన్ తో స్టార్ హీరోలకు అసాధారణ విజయాలు అందించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇద్దరు కొంత కాలంగా సరైన హిట్లు లేక అంతే సతమతమవుతున్నారు.ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు. అదనంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఇద్దరు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వస్తోంది. ఇద్దరు ప్రముఖులు ఘనమైన రీఎంట్రీ ఇచ్చేందుకు కలిసి పని చేస్తున్నారనే వార్తలు నెట్టింట సంచలనం రేపుతున్నాయి.
ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మురగదాస్ రచయితగా వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. శంకర్ సినిమాల్లో భారీ బడ్జెట్, సామాజిక అంశాలు, అద్భుతమైన విజువల్స్ ఉండేలా చూసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. మరోవైపు మురగదాస్ తనదైన సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ మాస్ యాక్షన్‌లతో గుర్తింపు తెచ్చుకున్నా? ఆయన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఈ నేపథ్యంలో శంకర్ డైరెక్షన్‌కు మురగదాస్ బలమైన కథ, సంభాషణలు తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.
ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒకే ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయడం అనేది సాధారణ విషయం కాదు. అందులోనూ కెరీర్ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు ఇలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందనే వార్త పరిశ్రమలో చర్చనీ యాంశమవుతోంది. ఒకరు దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటూ.. మరొకరు పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను అందిస్తుండటం వల్ల ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రేజీ కలయిక నిజంగానే తెరకెక్కాలని.. దీనివల్ల ఇద్దరు పాత వైభవాన్ని తిరిగి సాధించాలని అభిమానులు అంతే కోరుకుంటున్నారు.
అయితే ఈ ప్రచారంపై శంకర్ కానీ, మురగదాస్ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? లేక? నిజంగానే తెరవెనుక ఏదైనా భారీ ప్లాన్ నడుస్తోందా అనేది త్వరలోనే తేలనుంది. అయినా? ఇద్దరు అనుభవజ్ఞులు ఒకే తాటిపైకి వస్తున్నారనే వార్తే సినిమా ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. శంకర్ చివరిగా `గేమ్ ఛేంజర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, మురగదాస్ `మదరాసీ` సినిమాతో వచ్చారు. కానీ ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగానే నమోదైన సంగతి తెలిసిందే.