తనను విమర్శించిన సీనియర్ నటిపై సూపర్‌స్టార్ గరంగరం!
పరిశ్రమలో లైంగిక వేధింపులు, పని ప్రదేశాల్లో స్త్రీల సౌకర్యాలపై మహిళా జడ్జి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని ప్రముఖ నటీమణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా మారుతోంది.
పరిశ్రమలో లైంగిక వేధింపులు, పని ప్రదేశాల్లో స్త్రీల సౌకర్యాలపై మహిళా జడ్జి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని ప్రముఖ నటీమణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా మారుతోంది. పరిశ్రమలోని అగ్ర హీరోలు, మేల్ స్టార్స్ వైఖరి ఇప్పటికీ మారలేదని, మహిళా కళాకారుల సమస్యలు ఎప్పటిలాగే మిగిలిపోయాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమలోని వివక్షకు నిరసనగా పాపులర్ సీనియర్ నటీమణులు ఆర్టిస్టుల అసోసియేషన్ మెంబర్‌షిప్‌కు రాజీనామా చేసి వైదొలగడం సంచలనంగా మారింది. దీని అర్థం పరిశ్రమలో ఇంకా స్త్రీల సౌకర్యాలు మెరుగుపడలేదు. వేధింపులు ఆగలేదనే భావిస్తున్నారు.
ఆ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తరుణంలో పరిశ్రమకు చెందిన కొందరు పెద్ద స్టార్లు తమ పదవులకు బాధ్యతారాహిత్యంగా రాజీనామా చేశారని, సమస్యకు పరిష్కారం వెతకాల్సిన వాళ్లు ఇలా చేయడం ఏమిటని సదరు ప్రముఖ నటీమణి ధ్వజమెత్తారు. ముఖ్యంగా అప్పట్లో ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సూపర్ స్టార్ తన పదవిని వదిలిపెట్టి వెళ్ళిపోవడంపై ఈ సీనియర్ నటి సూటి విమర్శలు గుప్పించారు. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా అంతటి పెద్ద సూపర్ స్టార్ సంక్షోభ సమయంలో బాధ్యత తీసుకోకుండా తప్పుకోవడాన్ని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ రాజీనామాల పర్వంతో గ్లామర్ పరిశ్రమలో మహిళా లోకానికి ఇప్పటికీ న్యాయం జరగడం లేదనే పచ్చి నిజం మరోసారి బహిర్గతమైందని సదరు ప్రముఖ నటీమణి ఆవేదన చెందారు. ఇలాంటి వ్యవస్థలు ఎప్పటికీ మారవని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు విచారణలు జరగడం కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుందని... కానీ దాని వల్ల ఆశించిన ప్రయోజనం ఏమాత్రం ఉండటం లేదని ఆమె నిట్టూర్చారు.
పరిశ్రమలో ఎంతటి పెద్ద సూపర్ స్టార్ అయినా.. తప్పును తప్పుగా ఎత్తిచూపిన ఈ సీనియర్ నటి ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అంతర్గతంగా ఉన్న పురుషాధిక్యతను, బాధ్యతారహిత వైఖరిని ప్రశ్నిస్తూ ఈ వెటరన్ నటీమణి చేసిన సాహసోపేతమైన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సూటి విమర్శలకు నొచ్చుకున్న సూపర్ స్టార్ సదరు సీనియర్ నటీమణులపై గరంగరంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు సూపర్ స్టార్ కు సమకాలికురాలైన సీనియర్ నటి ఇలా సూటిగా విమర్శించడంతో దీనిపై ఇండస్ట్రీలో వాడి వేడిగా చర్చ సాగుతోంది.