బాలీవుడ్‌లో మరో బ్రేకప్ కలకలం: బోయ్ ఫ్రెండ్ వైఖరికి విసిగిపోయి..!
బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్‌లు సహజమే అయినా.. తాజాగా వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.;
బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్‌లు సహజమే అయినా.. తాజాగా వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. `దంగల్` సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన నటి సాన్యా మల్హోత్రా.. తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ నుంచి విడిపోయినట్లు గట్టిగా వినిపిస్తోంది. గతంలో అనన్యా పాండే-ఆదిత్య రాయ్ కపూర్, తమన్నా భాటియా-విజయ్ వర్మ వంటి జంటల బ్రేకప్ వార్తలు ఎలాగైతే వెబ్ ప్రపంచాన్ని హీటెక్కించాయో ఇప్పుడు సాన్యా మల్హోత్రా వ్యవహారం కూడా అదే స్థాయిలో చర్చకు దారితీస్తోంది.
గత ఏడాది కాలంగా సాన్యా మల్హోత్రా అంతర్జాతీయ సితార్ విద్వాంసుడు రిషబ్ రిఖిరామ్ శర్మ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరు తమ సంబంధాన్ని చాలా గోప్యంగా ఉంచినా.. గత ఏడాది డిసెంబర్‌లో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి బంధం బహిర్గతమైంది. గ్లామర్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తితో సాన్యా ప్రేమాయణం సాగించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఏడాది తిరక్కుండానే వీరి మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వార్తలు అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి.
ఈ అందమైన జంట విడిపోయారనే అనుమానాలకు బలమైన కారణం సోషల్ మీడియా చర్యలే. తాజా సమాచారం ప్రకారం.. సాన్యా మల్హోత్రా - రిషబ్ రిఖిరామ్ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. కేవలం అన్‌ఫాలో చేయడమే కాకుండా.. గతంలో కలిసి దిగిన ఫోటోలను.. స్వీట్ మెమరీస్ ను కూడా తమ సోషల్ మీడియా ఖాతాల నుండి తొలగించినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల ప్రపంచంలో ఇలా ఫోటోలు తొలగించడం, అన్‌ఫాలో చేసుకోవడం అనేది సాధారణంగా విడిపోవడానికి సంకేతంగా భావిస్తారు.
రిషబ్ రిఖిరామ్ శర్మ సంగీత ప్రపంచంలో ముఖ్యంగా సితార్ వాయిద్యంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి. మరోవైపు సాన్యా మల్హోత్రా తన కెరీర్ పరంగా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. సన్యా ప్రస్తుతం శ్రీమతి, సన్నీ సంస్కారి కి తులసి కుమారి వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. ఇద్దరూ తమ వృత్తిపరమైన బాధ్యతల్లో మునిగిపోవడం వల్ల లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారా? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ జంట విడిపోవడానికి అసలు కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.
ప్రస్తుతానికి ఈ జంట బ్రేకప్ గురించి సాన్యా వైపు నుండి కానీ.. అటు రిషబ్ వైపు నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలపై స్పందించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా... ఒక అందమైన జంట ఇలా ఏడాది వ్యవధిలోనే విడిపోవడం అనేది బాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. మునుముందు వీరిద్దరిలో ఎవరైనా ఈ కథనాలపై స్పందిస్తారేమో వేచి చూడాలి.