5750 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద సంజయ్ దత్ `ధురంధర` వసూళ్లు
బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.;
బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కోవిడ్ అనంతర కాలంలో పలువురు స్టార్ హీరోలు విజయాల కోసం తపిస్తుంటే.. సంజయ్ దత్ మాత్రం వరుస రికార్డులతో దూసుకుపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఆయన నటించిన 11 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కలిపి సుమారు 5748.91 కోట్ల రూపాయల భారీ గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. ఈ అంకెలు అతడికి ఉన్న తిరుగులేని బాక్సాఫీస్ స్టామినాను.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా అతడు చేస్తున్న పాత్రల ప్రాముఖ్యతను చాటిచెబుతున్నాయి.
సంజయ్ దత్ బాక్సాఫీస్ లెక్కలను మార్చిన చిత్రాల్లో `ధురంధర్` సిరీస్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫ్రాంచైజీ మొదటి భాగం 1354.84 కోట్లు వసూలు చేయగా.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న`ధురంధర్ 2` కేవలం కొద్ది రోజుల్లోనే 1764.63 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ స్థాయి వసూళ్లు కేవలం ఒక బాలీవుడ్ నటుడిగానే కాకుండా.. పాన్ ఇండియా స్టార్‌గా అతడికి ఉన్న ఇమేజ్‌ను సుస్థిరం చేశాయి. కోవిడ్ తర్వాత సంజయ్ దత్ కెరీర్‌ను మలుపు తిప్పిన మరో చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఇందులో `అధీర` పాత్ర గొప్ప పేరు తెచ్చింది. ఈ చిత్రం 1228.59 కోట్ల వసూళ్లతో దత్ ని గ్లోబల్ విలన్‌గా నిలబెట్టింది.
కేవలం బాలీవుడ్ చిత్రాలకే పరిమితం కాకుండా.. సంజయ్ దత్ దక్షిణాది మార్కెట్‌పై కూడా బలమైన ముద్ర వేశారు. దళపతి విజయ్ నటించిన `లియో` చిత్రంతో 606.42 కోట్లు, రామ్ పోతినేని `డబుల్ ఇస్మార్ట్` వంటి చిత్రాల ద్వారా సౌత్ ఆడియన్స్‌కు మరింత చేరువయ్యారు. అలాగే `హౌస్‌ఫుల్ 5` (304.12 కోట్లు), `బాఘీ 4` (94.14 కోట్లు) వంటి మల్టీస్టారర్ సినిమాలు కూడా అతడి ఆర్థిక స్థితిని భారీగా పెంచడంలో తోడ్పడ్డాయి. కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, ఈ మెగా హిట్స్ ఆ లోటును భర్తీ చేశాయి.
భారీ విజయాల మధ్య `సామ్రాట్ పృథ్వీరాజ్`, `షంషేరా`, భూత్నీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. అయితే, సినిమా ఇండస్ట్రీలో ఉండే అనిశ్చితిని ఇవి ప్రతిబింబిస్తున్నా.. సంజయ్ దత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. చిన్న చిత్రాల పరాజయాలను పెద్ద చిత్రాల బ్లాక్ బస్టర్ విజయాలు కప్పివేస్తూ, ఆయన్ను ట్రేడ్ వర్గాల్లో మోస్ట్ వాంటెడ్ సీనియర్ స్టార్‌గా ఉంచాయి. తన పాత్ర ఏదైనా, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలనని ఆయన నిరూపించారు.
మునుముందు సంజయ్ దత్ కెరీర్ మరిన్ని మైలురాళ్లను అందుకోవడం ఖాయం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న `రాజా శివాజీ`... సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్ వంటి దిగ్గజాలతో కలిసి నటిస్తున్న `బాప్` చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయవంతమైతే.. సంజయ్ దత్ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులు కొత్త శిఖరాలను తాకడం ఖాయం. ఒక సీనియర్ నటుడిగా దత్ సాగిస్తున్న ఈ జైత్రయాత్ర నేటి తరం నటులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.