హిట్ తర్వాత కూడా రిస్క్.. టాలీవుడ్ హీరో డిఫరెంట్ గేమ్ ప్లాన్!
టాలీవుడ్‌లో కొత్త తరహా కెరీర్ ప్లానింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోల్లో సంగీత్ శోభన్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.;
టాలీవుడ్‌లో కొత్త తరహా కెరీర్ ప్లానింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరోల్లో సంగీత్ శోభన్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా ఒకటి రెండు హిట్స్ కొట్టిన తర్వాత స్టార్ డైరెక్టర్లతో పనిచేయాలని అనుకుంటారు. కానీ సంగీత్ మాత్రం అందుకు విరుద్ధంగా, డెబ్యూ డైరెక్టర్లను ఎంచుకుంటూ ముందుకు సాగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
కొత్త డైరెక్టర్లతోనే!
తాజాగా రాకాస మూవీతో హిట్ అందుకున్న సంగీత్, ఇప్పటికే మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ లాంటి సినిమాలతో తన కామెడీ టైమింగ్‌ను నిరూపించుకున్నాడు. ఈ సక్సెస్‌ల తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడకుండా, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించడం అతని కెరీర్‌లో ప్రత్యేకతగా కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి డెబ్యూ డైరెక్టర్ ప్రణయ్ తోనే కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు సంగీత్. ప్రణయ్ గతంలో ప్రభాస్ సాహో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ, మ్యాడ్ ఫ్రాంచైజ్ సినిమాలకు అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ గానూ వర్క్ చేశాడు.
సాధారణంగా యంగ్ హీరోలు హిట్ తర్వాత తమ మార్కెట్‌ను పెంచుకునే దిశగా పెద్ద డైరెక్టర్లతో పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఒక విధంగా దాన్ని సేఫ్ స్ట్రాటజీగా కూడా భావిస్తారు. కానీ సంగీత్ మాత్రం రిస్క్ తీసుకుంటూ తన ధైర్యాన్ని చూపిస్తున్నాడు. కొత్త డైరెక్టర్లతో పని చేయడమనేది ఒకవైపు అనిశ్చితి ఉన్న ప్రయాణం. స్క్రిప్ట్, టేకింగ్, ఎగ్జిక్యూషన్.. ఇవన్నీ కొత్తవాళ్ల చేతుల్లో ఉండటం వల్ల ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అయినప్పటికీ ఇప్పటివరకు అతను తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఫలితాలను ఇచ్చినట్టే కనిపిస్తున్నాయి.
కొత్త డైరెక్టర్లతో పని చేయడం అంటే రిస్క్ అనిపించినా, అదే సమయంలో కొత్త ఐడియాలు, ఫ్రెష్ నేరేషన్ స్టైల్, అన్‌ప్రెడిక్టబుల్ ఎంటర్టైన్మెంట్‌ను కూడా తీసుకురావచ్చు. సంగీత్ కెరీర్‌లో ఇప్పటివరకు చూసుకుంటే, ఈ రిస్క్ అతనికి రివార్డ్‌గా మారింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో అతనికి పెరిగిన ఫాలోయింగ్ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే, సంగీత్ ఎంచుకుంటున్న కథలు మరియు డైరెక్టర్లు అతని ఇమేజ్‌ను ఒకే జానర్‌లో బంధించకుండా, విభిన్న దిశల్లో తీసుకెళ్తున్నాయి. కామెడీ నుంచి యాక్షన్ కామెడీ వైపు అతను తీసుకుంటున్న అడుగులు కూడా ఈ స్ట్రాటజీలో భాగంగానే కనిపిస్తున్నాయి. ఇది లాంగ్ టర్మ్‌లో అతనికి వెర్సటైల్ హీరోగా గుర్తింపు తెచ్చే అవకాశముంది.
అయితే, ఈ ప్రయాణం ఎప్పటికీ ఇలాగే సాఫీగా సాగుతుందా అనేది చూడాల్సిన విషయం. ప్రతి రిస్క్ సక్సెస్ అవుతుందనే గ్యారెంటీ ఉండదు. ఒకటి రెండు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీపై ప్రశ్నలు రావడం సహజం. అయినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం సంగీత్ తన నిర్ణయాలతో ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, కొత్త మార్గాన్ని సృష్టిస్తున్నాడు.