టాలెంట్ ఉన్న హీరో కనిపించట్లేదేంటి..

‘వంగవీటి’లో రాధ, రంగా పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. ‘జార్జిరెడ్డి’లో ఆవేశంగా కనిపించిన స్టూడెంట్ లీడర్ కూడా జనాలకు గుర్తున్నాడు.

Update: 2026-10-13 09:30 GMT

‘వంగవీటి’లో రాధ, రంగా పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. ‘జార్జిరెడ్డి’లో ఆవేశంగా కనిపించిన స్టూడెంట్ లీడర్ కూడా జనాలకు గుర్తున్నాడు. కానీ ఆ పాత్రల్లో నటించిన సందీప్ మాధవ్ మాత్రం ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఒక హీరోకు ఇంత తొందరగా రెండు గుర్తుండిపోయే పాత్రలు దొరకడం అరుదు. అలాంటి అవకాశం వచ్చినా, దాన్ని వరుస సినిమాలుగా మార్చుకోలేకపోవడం సందీప్ కెరీర్‌లో విచిత్రమైన విషయం.

2016లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వంగవీటి’లో సందీప్ రెండు పాత్రలు చేశారు. రాధ, రంగా ఇద్దరి మధ్య తేడాను చూపించడానికి లుక్స్, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు. మూడేళ్ల తర్వాత ‘జార్జిరెడ్డి’ కోసం మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఆ పాత్ర కోసం కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. అప్పట్లో సినిమా ఫలితం మీద భిన్నాభిప్రాయాలు వచ్చినా, సందీప్ నటనకు గుర్తింపు దక్కింది. ఇక వరుసగా సినిమాలు వస్తాయని అనుకున్నారు.

అయితే సందీప్ అప్పట్లోనే ఒక విషయం చెప్పారు. ‘వంగవీటి’ తర్వాత అవకాశాలు వచ్చినా, తనకు సరిపోయే కథలు దొరకలేదన్నారు. ‘జార్జిరెడ్డి’ తర్వాత కూడా చాలా కథలు విన్నానని, వాటిలో ఎక్కువగా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కనిపించిందని వివరించారు. రెండు బయోపిక్స్ చేసినంత మాత్రాన జీవితాంతం అలాంటి పాత్రలే చేయాలని లేదని కూడా చెప్పారు. కొత్త కాన్సెప్ట్ కోసం ఎదురుచూసిన సందీప్ చివరికి ‘గంధర్వ’ను ఎంచుకున్నారు.

2022లో వచ్చిన ‘గంధర్వ’ కథ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగానే ఉంది. 1971లో యుద్ధానికి వెళ్లిన సైనికుడు యాభై ఏళ్ల తర్వాత తిరిగొస్తే ఏం జరుగుతుందనే పాయింట్ తీసుకున్నారు. కొత్తగా అనిపించే కథే అయినా, దాన్ని తెరపై చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా నిలబడలేదు. అలా సందీప్ కోరుకున్న మార్పు ఈ సినిమా ద్వారా రాలేదు. అప్పటి నుంచి మరో చిత్రం థియేటర్లకు రాలేదు. నాలుగేళ్లు దాటిపోయాయి.

ఇప్పుడు చేస్తున్న ‘రామ్ భజరంగ్’కు కూడా 1980ల నేపథ్యమే. అంటే సందీప్ ఎంచుకుంటున్న సినిమాల్లో పాతకాలపు వాతావరణం మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. అలాంటి పాత్రలు చేయడంలో గుర్తింపు ఉన్నా, ఇప్పటి కాలానికి చెందిన నార్మల్ యువకుడిగా సందీప్‌ను చూసే అవకాశం ప్రేక్షకులకు పెద్దగా రాలేదు. ఇది ఆయన కావాలని చేయకున్నా, అలాంటి కథలే ఎక్కువగా వస్తున్నాయి.

ఆమధ్య రాజ్ తరుణ్‌తో కలిసి సందీప్ ‘రామ్ భజరంగ్’ స్టార్ట్ చేశాడు. కానీ దాని హడావుడి పెద్దగా లేదు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు మేకర్స్ చెప్పారు. అయితే విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. మరి సందీప్ నెక్స్ట్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News