స‌ల్మాన్ ఖాన్ ముంబై నుంచి హైద‌రాబాద్ కి మకాం!

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స‌ల్మాన్ కు నిరంతరం వస్తున్న ప్రాణహాని హెచ్చరికలు బాలీవుడ్ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2026-08-26 00:30 GMT

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జీవితం గత కొంతకాలంగా భద్రతా ఆందోళనల నడుమ సాగుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స‌ల్మాన్ కు నిరంతరం వస్తున్న ప్రాణహాని హెచ్చరికలు బాలీవుడ్ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ టార్గెట్‌గా జరిగిన కాల్పుల ఘటన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అత్యున్నత స్థాయి వై-ప్లస్ భద్రతను కేటాయించింది. అప్పట్నుంచి ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా? పటిష్టమైన పోలీసుల పహారా, ప్రత్యేక భద్రతా సిబ్బంది నీడలా వెంట ఉంటున్నారు. ముంబైలోని నివాసంలోనూ, షూటింగ్ లొకేషన్లలోనూ కఠినమైన ఆంక్షల మధ్యే స‌ల్మాన్ కాలం గడపాల్సి వస్తోంది.

ఈ నేపధ్యంలో తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కొంతకాలం పాటు ముంబై నగరాన్ని వీడి హైదరాబాద్‌కు మకాం మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిరంతరం ఉత్కంఠభరిత వాతావరణం, భద్రతాపరమైన తీవ్ర ఒత్తిడి నుంచి కొన్నాళ్ల పాటు ఉపశమనం పొందేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో ఆయనకున్న దీర్ఘకాలిక అనుబంధం, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా మార్పునకు ప్రధాన కారణాలుగా క‌నిపిస్తున్నాయి. ముంబైలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కంటే హైదరాబాద్‌లో ప్రశాంతంగా షూటింగ్స్ పూర్తి చేసుకో వచ్చని స‌ల్మాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ ... గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక సౌకర్యాలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఉండేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది. టాలీవుడ్‌లో పలువురు ప్రముఖ హీరోలు , నిర్మాతలు సల్మాన్ ఖాన్‌కు అవసరమైన అన్ని రకాల వసతులు, ప్రైవసీని కల్పించేందుకు ముందుకు వ‌స్తున్న‌ట్లు సమాచారం. నివాసమే కాకుండా తదుపరి చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే జరిగేలా ప్రణాళికలు సిద్ద‌మ‌వుతున్నాయ‌ట‌. దీంతో నిరంతరం పోలీసుల నిఘా వలయం నుంచి కాస్త విముక్తి లభిస్తుందని సన్నిహితులు భావిస్తున్నారు.

ఇదే నిజ‌మ‌తై...సల్మాన్ ఖాన్ ముంబైని విడిచి తాత్కాలికంగా వేరే నగరానికి మకాం మార‌డం అనేది చిత్ర పరిశ్రమలో పెద్ద పరిణామంగా చెప్పొచ్చు. ఇది వ్యక్తికి సంబంధించిన భద్రతా సమస్య మాత్రమే కాదు. సెలబ్రిటీల ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడికి, ఆందోళనకు అద్దం పడుతోంది. దేశం గర్వించదగ్గ అగ్ర నటుడు సాధారణ జీవనాన్ని గడపడానికి కూడా ఇన్ని ఇబ్బందులు పడాల్సి రావడం పట్ల ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా? స‌ల్మాన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ మార్పు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది చూడాలి.

Tags:    

Similar News