కౌబాయ్ హ్యాట్స్తో సల్మాన్ ఖాన్- సలీమ్ ఖాన్ ట్విన్నింగ్!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తండ్రి.. ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తండ్రి.. ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్‌తో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 91 ఏళ్ల వయసున్న తండ్రితో కలిసి దిగిన కొన్ని అరుదైన, ఆసక్తికరమైన ఫోటోలను సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తండ్రీకొడుకులిద్దరూ ఒకే రకమైన కౌబాయ్ హ్యాట్స్ ధరించి ఎంతో సరదాగా.. ప్రేమగా కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒక ఫోటోలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ను వెనుక నుంచి హగ్ చేసుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. మరో ఫోటోలో తండ్రి పక్కన కూర్చుని ఆయన చేతిని ఆప్యాయంగా పట్టుకుని ఉన్నారు. ఈ ఫోటోలకు సల్మాన్ పెట్టిన క్యాప్షన్ ఎంతో ఫన్నీగా భావోద్వేగంగా సాగింది. `91 ఏళ్ల వయసులో కూడా ఆయనలో అదే పవర్ ఉంది.. తండ్రి ఎప్పటికీ తండ్రే! ఆయనే అసలైన మాన్స్టర్. మనందరి తండ్రుల్లోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వందేమాతరం` అని సల్మాన్ రాసుకొచ్చారు.
ఇంతటితో ఆగకుండా సమయం విలువను గుర్తుచేస్తూ సల్మాన్ మరో సందేశాన్ని కూడా జోడించారు. `ఒక రోజు గడిచిందంటే మన జీవితంలో ఇంకో రోజు పెరిగినట్లు కాదు. ఒక రోజు తగ్గినట్లే.. మీ అందరికీ ఇది అర్థమవుతోందా? దేవుడు ఎంతో దయగలవాడు` అంటూ జీవితంలోని క్షణాలను కుటుంబంతో ఆస్వాదించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. `తండ్రీకొడుకుల బంధానికి ఇదొక చక్కటి నిదర్శనం` అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తండ్రితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ జీవితంలో ఏవైనా సందేహాలు..సలహాలు తీసుకోవాల్సి వస్తే ముందుగా సలీమ్ ఖాన్ సలహానే తీసుకుంటానని తెలిపారు. చాలామంది ఇతరుల నుంచి సలహాలు తీసుకుని తమకు తోచినట్లు చేస్తారని.. కానీ తాను మాత్రం తన తండ్రి ఏది చెబితే ఆ మాటను కచ్చితంగా పాటిస్తానని సల్మాన్ వెల్లడించారు.
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో కొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అపూర్వ లఖియా దర్శకత్వంలో నటించిన `మాతృభూమి` సినిమా విడుదల కావలసి ఉంది. అలాగే దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా `మాన్స్టర్` అని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తండ్రిని ఉద్దేశించి `మాన్ స్టర్` అని సంబోధించడంతో అదే టైటిల్ ఖరార రవుతుందా? అన్న సందేహాలు బలపడుతున్నాయి.