బిగ్ డిబేట్: పుట్టి ముంచుతున్న AI సంగీతం! భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోంది?

సంగీత రంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు సలీమ్ మెర్చంట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

Update: 2026-09-21 03:55 GMT

సంగీత రంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు సలీమ్ మెర్చంట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక భారీ చిత్రంలోని కొత్త పాటను `సునో` అనే ఏఐ మ్యూజిక్ టూల్ ద్వారా రూపొందించారని 100 శాతం క‌చ్చితత్వంతో తెలిపారు. అయితే ఏ సినిమా లేదా ఏ పాట గురించీ ఆయన స్పష్టంగా టైటిల్ చెప్పకపోవడం ఇంటర్నెట్‌లో పెద్ద గందరగోళానికి దారితీసింది.

సలీమ్ మెర్చంట్ వ్యాఖ్యల వెనుక అసలు నిజం తెలియకుండానే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దాన్ని రణబీర్ కపూర్ `రామాయణం` చిత్రంలోని `జై జై రామ్` పాటతో ముడిపెట్టారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించి.. కుమార్‌ విశ్వాస్ రాసిన ఈ భక్తి గీతంలో అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్ తమ అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినా వ్యూస్- ఎంగేజ్‌మెంట్ కోసం కొన్ని సోషల్ మీడియా ఖాతాలు కావాలనే ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేశాయి.

ఈ తప్పుడు ప్రచారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సలీమ్ మెర్చంట్ ఇంటర్వ్యూ కాలక్రమం `రామాయణం` పాట విడుదల కంటే ముందే జరిగిందని.. ఆయన అసలు `వెల్కమ్ టు ది జంగిల్` సినిమా గురించీ మాట్లాడారని కొందరు స్పష్టం చేశారు. కేవలం వ్యూస్, నెగెటివిటీ .. సంచలనం కోసం సోషల్ మీడియాలో ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయడంపై పలువురు మండిపడ్డారు.

ఇక అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్ లాంటి దిగ్గజ గాయకుల గొంతులోని భావోద్వేగాన్ని, భక్తిని ఏ అల్గారిథమ్ లేదా కృత్రిమ మేధస్సు ఎప్పటికీ కాపీ చేయలేదని అభిమానులు గట్టిగా సమర్థించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా... మానవ సృజనాత్మకతకు .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మధ్య ఉండే వ్యత్యాసాన్ని ప్రేక్షకులు స్పష్టంగా గుర్తించగలరని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

మొత్తంగా.. ఈ వివాదం సంగీత రంగంలో ఏఐ పాత్ర ఎంతవరకు ఉండాలనే దానిపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. సునో వంటి ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు పూర్తి స్థాయి మ్యూజిక్ కంపోజిషన్లను సృష్టిస్తుండటంతో భ‌విష్య‌త్‌లో సాంప్రదాయ సంగీతానికి, సింథటిక్ మ్యూజిక్‌కు మధ్య తేడాను గుర్తించడం శ్రోతలకు కష్టతరంగా మారుతోంది. ఏది ఏమైనా కానీ.. అధికారిక సమాచారం లేకుండా సెలబ్రిటీల వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు వార్తలు సృష్టించే సోషల్ మీడియా సంస్కృతిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్జీవీ ముందే చెప్పిన‌ట్టుగా అంతా మారుతోంది:

సినిమా రంగంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం ప్రస్తుతం కేవలం ప్రయోగాత్మక దశను దాటి.. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ , సంగీత విభాగాలలో వేగంగా విస్తరిస్తోంది. రామ్‌గోపాల్ వర్మ లాంటి ప్రముఖ దర్శకులు ముందే హెచ్చరించినట్లుగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సృజనాత్మక రంగాలపై ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి చలనచిత్ర పాటలను లేదా శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (బీజీఎం) థీమ్‌లను ఏఐ కేవలం కొన్ని సెకన్లలోనే జనరేట్ చేయగలిగినా కానీ.. వాటిలో మానవుల భావోద్వేగాలు, సహజమైన అనుభూతిని పూర్తిగా తీసుకురావడంపై ఇంకా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంపోజర్లు - టెక్నీషియన్లు తమ వర్క్‌ఫ్లోను వేగవంతం చేయడానికి.. ప్రత్యామ్నాయ ట్యూన్‌లను త్వరగా అంచనా వేయడానికి ఏఐ టూల్స్‌ను ఒక అసిస్టెంట్‌గా విరివిగా వాడుతున్నారు.

అయితే.. సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా సినిమా రంగంలో మానవ సృజనాత్మకతకు ఉన్న విలువ ఎప్పటికీ తగ్గదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ అనేది మ్యూజిక్ లేదా ఎడిటింగ్‌లో కేవలం ఒక సాధనంగా మాత్రమే సహాయపడగలదు కానీ.. ఒక పాటకు లేదా సన్నివేశానికి కావాల్సిన అసలైన ప్రాణం, ఆత్మను మాత్రం కేవలం కళాకారులు మాత్రమే అందించగలరు. భవిష్యత్తులో ఏఐ కారణంగా సాంప్రదాయ సంగీత దర్శకులకు, టెక్నీషియన్లకు పోటీ పెరుగుతుందా లేక వారి సృజనాత్మకతకు ఏఐ మరింత మెరుగులద్దుతుందా అనేది భ‌విష్య‌త్ సినిమాల ఫలితాలు- ప్రేక్షకుల స్పందనపైనే ఆధారపడి ఉంటుంది.

Tags:    

Similar News