సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ ఛాలెంజ్!

‘సాహా: లైఫ్ ఆఫ్ సంజు’ అనే సినిమా హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ ఎవరు ఉహించని ఛాలెంజ్ చేశారు.

Update: 2026-08-27 11:03 GMT

‘సాహా: లైఫ్ ఆఫ్ సంజు’ అనే సినిమా హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ ఎవరు ఉహించని ఛాలెంజ్ చేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా డిజప్పాయింట్ అయితే అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు కొట్టించుకుంటానంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడిన తీరుకు అందరూ షాక్ అయ్యారు.

సెప్టెంబర్ 4న విడుదల కాబోతున్న ‘సాహా’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో శ్వేత ఈ కామెంట్స్ చేశారు. ప్రేక్షకులను సినిమా చూడమని తాను రిక్వెస్ట్ చేయడం లేదని, నేరుగా ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. అంత గట్టిగా ఈ కథను నమ్ముతున్నానని, సినిమా చూసిన తర్వాత మంచి ప్రయత్నం చేశారని ప్రేక్షకులే చెబుతారని ధీమాగా మాట్లాడారు.

ఈ సినిమా వెనుక పెద్ద బడ్జెట్, స్టార్ కాస్ట్ ఏమీ లేదని శ్వేత చెప్పుకొచ్చారు. కథను నమ్ముకుని కొత్తవాళ్లతో ఈ ప్రయాణం మొదలుపెట్టామని.. ప్రేమ అంటే కేవలం పాటలు, సరదా మాత్రమే కాదని, అందులో బాధ, త్యాగం, కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయని తెలిపారు. జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం చుట్టూ ‘సాహా’ కథ సాగుతుందని వివరించారు.

ఈ సందర్భంగా బన్నీ వాసు, వంశీ నందిపాటికి కూడా ఆమె ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతూ.. కొత్తవాళ్లు చేసిన సినిమాను గుర్తించి అండగా నిలబడటం తమ టీమ్‌కు ఎంతో ధైర్యం ఇచ్చిందని అన్నారు. నిర్మాత తేజేశ్వర్ వెల్పుచర్ల, దర్శకుడు నిశాంత్ దోటి, హీరో శివ కుమార్ కాసారంతో పాటు సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తు చేశారు.

‘సాహా’ తమకు కేవలం ఒక సినిమా కాదని.. దీని వెనుక దాదాపు 50 నుంచి 60 మంది కొత్తవాళ్ల కలలు, కష్టం ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులకు మంచి థియేటర్లలో, అందుబాటులో ఉండే టికెట్ ధరలతో సినిమాను చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శివ కుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిశాంత్ దోటి దర్శకత్వం వహించాడు. సుమైరా స్టూడియోస్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. సాధారణంగా రిలీజ్ ముందు ప్రతి టీమ్ తమ సినిమా బాగుందని చెబుతుంది. కానీ శ్వేత మాత్రం ఏకంగా గుండు ఛాలెంజ్ వరకు వెళ్లింది. మరి సెప్టెంబర్ 4న ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.




Tags:    

Similar News