బ్రాండ్ వర్మకు కాలం చెల్లిన‌ట్లేనా? మ‌రో పూరి అసాధ్య‌మేనా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక శకాన్ని తిరగరాసిన ఘనత రామ్ గోపాల్ వర్మ కు దక్కుతుంది.

Update: 2026-08-30 02:45 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక శకాన్ని తిరగరాసిన ఘనత రామ్ గోపాల్ వర్మ కు దక్కుతుంది. ఆయన ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను అందించడమే కాదు. తన ఆలోచనా విధానంతో అనేక మంది ప్రతిభావంతులైన యువకులకు అవకాశం ఇచ్చి వర్మ స్కూల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనే బ్రాండ్‌ను సృష్టించారు. కృష్ణ‌వంశీ పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి సంచలన దర్శకులు ఈ పాఠశాల నుంచే టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను లిఖించారు. అయితే వారి తదనంతరం ఆ రేంజ్ విజయాన్ని, ప్రభావాన్ని చూపించిన దర్శకుడు వర్మ క్యాంప్ నుంచి మళ్లీ రాలేద‌నే చెప్పాలి. హ‌రీష్ శంక‌ర్ కూడా వ‌ర్మ స్కూలే. కానీ పూరి రేంజ్ లో ఫేమ‌స్ కాలేదు. శ్రీరామ్ రాఘ‌వ‌న్, ఈశ్వ‌ర్ నివాస్ వంటి వారు బాలీవుడ్ కే ప‌రిమితం అవ్వ‌డంతో? ఇక్క‌డంత ఫేమ‌స్ కాలేక‌పోయారు.

ఒకప్పుడు వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయడం .. ఆయన గైడెన్స్‌లో సినిమా చేయడం అనేది డైరెక్టర్‌గా ఎదగడానికి గ్యారెంటీ కార్డుగా ఉండేది. కృష్ణవంశీ `గులాబి`, `సింధూరం` వంటి చిత్రాలతో టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను మార్చేస్తే పూరి జగన్నాథ్ `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `పోకిరి`, `బిజినెస్ మెన్` వంటి చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. వీరిద్దరూ వర్మ నుంచి టేకింగ్, హీరోయిజం ఎలివేషన్ , డైలాగ్ డెలివరీలోని పదునును పుణికి పుచ్చుకుని తమకంటూ విలక్షణమైన శైలిని ఏర్పరచుకున్నారు.

అయితే గత దశాబ్ద కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ క్రమంగా తన పంథాను మార్చు కుంటూ కమర్షియల్ విలువల కంటే ప్రయోగాలు, వివాదాస్పద అంశాలపైనే ఎక్కువ దృష్టి సారించారు. వర్మ స్వయంగా సినిమాల మేకింగ్‌లో మునుపటి పదును తగ్గించుకోవడం ఆయ‌న‌ శిష్యులపై కూడా పడింది. ఆయన వద్ద పనిచేసే అసిస్టెంట్లకు కూడా పూర్వపు తరహా స్క్రిప్ట్ వర్క్, గ్రిప్పింగ్ నారేషన్ నేర్చుకునే అవకాశం తగ్గడంతో కొత్తగా వచ్చేవారు ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి.

దీంతో ఇక వర్మ స్కూల్ నుంచి మరొక పూరి జగన్నాథ్ .. కృష్ణవంశీ లాంటి ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కులు రావడం అసాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆర్జీవీ శైలిలో ఉన్న రియలిస్టిక్, రా యాక్షన్ అండ్ డార్క్ థ్రిల్లర్స్ స్థానంలో.. ప్రస్తుతం గ్లోబల్ అప్పీల్ ఉన్న పాన్-ఇండియా కాన్సెప్ట్‌లు, విజువల్ వండర్స్ , ఎమోషనల్ డ్రామాలు రాజ్యం ఏలుతున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వర్మ స్కూల్ శైలి రూపాంతరం చెందకపోవడం కూడా మరొక ప్రధాన కారణం.

అయినా? వర్మ స్కూల్ నేర్పిన ప్రాథమిక సూత్రం భయం లేని మేకింగ్ , వినూత్న ఆలోచన. నేడు ఇండస్ట్రీలో డిజిటల్ విప్లవం వచ్చి ఓటీటీల హవా నడుస్తున్న సమయంలో ఆలోచనా స్వేచ్ఛ ఉన్న ఏ యంగ్ డైరెక్టర్ అయినా సరైన కంటెంట్‌తో వస్తే మళ్లీ ఆ ప్రభావాన్ని చూపించడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే వర్మ మార్క్ టేకింగ్‌ను అనుకరించకుండా నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా కథలను మలుచుకోవడం అత్యంత కీలకం.

అంతిమంగా రామ్ గోపాల్ వర్మ చురుగ్గా సినిమాలు చేయకపోవడం ఆయన స్కూల్ ప్రభావం తగ్గడం వాస్తవమే అయినా? పరిశ్రమలో ప్రతిభకు కొదవలేదు. వర్మ ఆలోచనా విధానాన్ని ప్రేరణగా తీసుకుని, ఆధునిక సాంకేతికతను జోడించి రాబోయే రోజుల్లో ఏ యువ దర్శకుడైనా సరికొత్త సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అది వర్మ బ్రాండ్‌తో కాకపోయినా? ఆయన ఆలోచనల విత్తనం నుంచి పుట్టుకొచ్చే కొత్త టాలెంట్‌గా మారే అవకాశాలను కొట్టి పారేయలేము.

Tags:    

Similar News