భార్య దర్శకత్వంలో భర్త నటన!
బాలీవుడ్‌లో ఆదర్శవంతమైన జంటలలో అశుతోష్ రాణా, రేణుకా షహానే ఒకరు. ఇటీవలే 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
బాలీవుడ్‌లో ఆదర్శవంతమైన జంటలలో అశుతోష్ రాణా, రేణుకా షహానే ఒకరు. ఇటీవలే 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తాజాగా వ్యక్తిగత బంధాన్ని వృత్తిపరమైన సరికొత్త మైలురాయి వైపు నడిపిస్తున్నారు. నటిగా, దర్శకురాలిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రేణుకా షహానే తొలిసారి భర్త అశుతోష్ రాణాను ప్రధాన పాత్రలో ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సరికొత్త డైరెక్టర్-యాక్టర్ కాంబినేషన్ చిత్ర పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా రేణుక ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. నిజ జీవితంలో ఎంతటి అద్భుతమైన భాగస్వాములైనా? కెమెరా వెనుక, కెమెరా ముందు వృత్తిపరమైన సంబం ధాన్ని విజయవంతంగా కొనసాగించడం సవాలుతో కూడుకున్న విషయమని రేణుక అభిప్రాయపడ్డారు.
తొలిసారి భర్తను డైరెక్ట్ చేసేటప్పుడు సహజంగానే కొంత ఆందోళన.. ఉత్కంఠ ఉంటాయని.. ఇది ఒక రకమైన జూదం లాంటిదన్నారు. అయితే సెట్స్‌పై తామిద్దరి పనితీరు తాను ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా ఉందని దర్శకురాలిగా, నటుడిగా గొప్ప బృందంగా నిరూపించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అశుతోష్ రాణా నటనపై రేణుక ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడి ఆలోచనలకు పూర్తిగా లొంగిపోయే అద్భుతమైన నటుడు కొనియాడారు. గతంలో అశుతోష్ నటించిన చిత్రం `సంఘర్ష్` సమయంలో దర్శకురాలు తనూజతో ఆయన పనిచేసిన విధానాన్ని తాను గమనించానని, అశుతోష్‌ను ఒక మట్టి ముద్దలా ఎలాగైనా మలచుకోవచ్చని అన్నారు.
ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా దర్శకుడి విజన్‌ను పూర్తిగా నమ్మి నటించే గుణం రాణాకు ఉందని, సెట్స్‌పై ఎంతో దయతో, సహనంతో వ్యవహరించారని రేణుక గుర్తు చేసుకున్నారు. అలాగే 25 ఏళ్ల వైవాహిక బంధం పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై కూడా స్పష్టతనిచ్చారు. అశుతోష్ రాణా షేర్ చేసిన పూలదండలు మార్చుకునే ఆ వీడియో గత ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అషుతోష్ పుట్టినరోజు వేడుకలలోనిదని తెలిపారు. పెళ్లి జరిగిన సమయంలో ఉన్న ఒత్తడి కంటే? రజతోత్సవ వేడుకల సమయంలో తమ పిల్లల సమక్షంలో ఆ క్షణాలను మరింత ప్రశాంతంగా, సంతోషంగా ఆస్వాదించగలిగామన్నారు.
గడిచిన పాతికేళ్ల వైవాహిక జీవితాన్ని రేణుక ఎంతో గొప్ప ప్రయాణంగా అభివర్ణించారు. తమ మధ్య భావోద్వేగాల బంధమే కాక విభిన్నమైన ఆలోచనల మార్పిడి కూడా జరుగుతుందన్నారు. ఇది తమ జీవితాన్ని మరింత సుసంపన్నం చేస్తుందన్నారు. పరస్పర నమ్మకం, ప్రేమ, గౌరవంతో పాటు ఇద్దరికీ ఉన్న మంచి హాస్య చతురత తమ బంధాన్ని రోజురోజుకూ మరింత దృఢంగా మారుస్తోందని రేణుక సంతోషం వ్యక్తం చేసారు. భవిష్యత్తులో తన భర్తతో కలిసి వెండితెరపై నటిగా స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక కూడా రేణుక బయట పెట్టారు. అయితే ఇద్దరినీ కలిపి డైరెక్ట్ చేసే బాధ్యతను సమర్థుడైన దర్శకుడికి అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వారు కలిసి చేస్తున్న షార్ట్ ఫిల్మ్ ద్వారా ఈ దంపతులు వృత్తిపరంగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.