'గుడ్ నైట్' వ్యవస్థాపకుడితో RB చౌదరి 'సూపర్ గుడ్' సినిమాలు!
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి ఆకస్మిక అంతర్థానం సినీపరిశ్రమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.;
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి ఆకస్మిక అంతర్థానం సినీపరిశ్రమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన గురించి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో `గుడ్ నైట్` వ్యవస్థాపకులు ఆర్. మోహన్ తో కలిసి ఆర్.బి చౌదరి పలు చిత్రాలను నిర్మించారు. సూపర్ గుడ్ బ్యానర్ లో చాలా కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారం సహా పలు ఫిలింఫేర్ పురస్కారాలను ఆర్.బి.చౌదరి అందుకోవడానికి ఈ ఫ్యామిలీ కథాంశాలు సహకరించాయి రతన్ లాల్ భగత్ రామ్ (ఆర్.బి) చైదరి రాజస్థానీ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. మరింత డెప్త్ తో వివరాల్లోకి వెళితే...
దక్షిణాది సినీ పరిశ్రమలో `సూపర్ గుడ్ ఫిలింస్` పేరు వినగానే ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన వ్యాపార భాగస్వామ్యం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి తన సినీ ప్రస్థానాన్ని `గుడ్ నైట్` దోమల సంహారిణి మందు వ్యవస్థాపకుడైన `గుడ్ నైట్` మోహన్‌తో కలిసి ప్రారంభించారు. వీరిద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహం.. వ్యాపార అవగాహన టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలలో సినిమాల నిర్మాణం పరంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
`గుడ్ నైట్` బ్రాండ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోహన్.. ఆర్.బి. చౌదరి కెరీర్ ఆరంభంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి కలయికలో మొదట `సూపర్` అనే బ్యానర్ ఏర్పడింది. ఆ తర్వాత చౌదరి తన మార్పులకు అనుగుణంగా దానిని `సూపర్ గుడ్ ఫిలింస్`గా రీబ్రాండ్ చేశారు. చౌదరిలోని సృజనాత్మకతకు.. మోహన్ అందించిన వ్యాపార తోడ్పాటు తోడవ్వడంతో ఈ బ్యానర్ అనతి కాలంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగింది. సినిమా నిర్మాణంలో మోహన్ భాగస్వామ్యం చౌదరి ఎదుగుదలకు ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై వచ్చిన చిత్రాలు కేవలం వాణిజ్య పరంగానే కాకుండా.. సామాజిక విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఆర్.బి. చౌదరి నిర్మాతగా తన ప్రతిభను చాటుకుంటూ తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారాలతో పాటు పలు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. మోహన్‌తో సాగించిన ఈ ప్రయాణం చౌదరిలోని వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రపంచానికి పరిచయం చేసింది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూనే...ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని అందించడంలో ఈ జోడీ సక్సెస్ అయ్యింది.
ఈ భాగస్వామ్యం కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కాకుండా.. పరిశ్రమలో పటిష్టమైన పునాదులను వేసింది. గుడ్ నైట్ మోహన్ అందించిన సహకారం చౌదరిని ఒక స్వతంత్ర - విజయవంతమైన నిర్మాతగా నిలబెట్టేలా చేసింది. నేడు సూపర్ గుడ్ ఫిలింస్ దక్షిణ భారతదేశంలో నాణ్యమైన చలనచిత్రాలకు ఒక చిహ్నంగా నిలిచిందంటే.. దానికి ఆనాడు వీరిద్దరి మధ్య కుదిరిన ఆ అరుదైన స్నేహపూర్వక భాగస్వామ్యమే ప్రధాన కారణం. సహకారం - సరైన భాగస్వామ్యం ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని వీరిద్దరూ నిరూపించారు.
ప్రస్తుతం ఆర్.బి. చౌదరి వారసత్వాన్ని ఆయన తనయులు కూడా కొనసాగిస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి నేటికీ చలనచిత్ర నాణ్యతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఒక దోమల సంహారిణి బ్రాండ్ వ్యవస్థాపకుడు.. ఒక చలనచిత్ర నిర్మాత మధ్య కుదిరిన ఈ `సూపర్ గుడ్` ఒప్పందం కొంత కాలానికి బ్రేక్ అయింది. కానీ సినీ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా మిగిలింది. ఆర్.బి చౌదరి రోడ్ ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరం. ఆయనకు కోలీవుడ్, టాలీవుడ్ సినీపరిశ్రమలు నివాళులు అర్పించాయి.
90లో మెజారిటీ ఫ్యామిలీ డ్రామాలు..
సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో దాదాపు 90కి పైగా చిత్రాలు రాగా.. అందులో మెజారిటీ సినిమాలు స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామాలు కావడమే ఈ సంస్థ ప్రత్యేకత. ముఖ్యంగా `ప్రేమించుకుందాం రా`, `సూర్యవంశం`, `రాజా`, `కలిసుందాం రా`, `ప్రియమైన నీకు`, `నిన్నే ప్రేమిస్తా`, `వసంతం`, `గోరింటాకు`, `అందాల రాముడు` వంటి చిత్రాలను సూపర్ గుడ్ బ్యానర్ పలు ఏరియల్లో పంపిణీ చేసింది. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు కుటుంబ విలువలని, అనుబంధాలని గుర్తు చేశాయి. తమిళంలో కూడా `పూవే ఉనక్కాగా`, `లవ్ టుడే`, `తుళ్ళాద మనముం తుళ్లుం` వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాలను నిర్మించి అగ్ర హీరోల కెరీర్‌లను మలుపు తిప్పింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. అందులో అశ్లీలతకు తావులేకుండా క్లీన్ ఎంటర్‌టైన్మెంట్ అందించడం వల్ల ఈ బ్యానర్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి.. కమర్షియల్ సక్సెస్‌తో పాటు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి.