నిర్మాత ఆర్‌బీ చౌదరికి దళపతి నివాళి.. జీవాను హగ్ చేసుకుని ఓదార్పు!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా పాపులరైన ఆర్‌బీ చౌదరి హఠాన్మరణం సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.;
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా పాపులరైన ఆర్‌బీ చౌదరి హఠాన్మరణం సినీ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రాజస్థాన్‌లోని బేవార్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారన్న వార్త తెలియగానే పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. `సూపర్ గుడ్ ఫిలిమ్స్` అధినేతగా ఎంతోమంది నటులను స్టార్లను చేసిన ఆయన.. కేవలం ఒక నిర్మాతగానే కాకుండా చిత్రసీమలో ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ మరణవార్త విన్న వెంటనే చెన్నైలోని చౌదరి నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు.
తమిళ స్టార్ హీరో - టీవీకే అధినేత దళపతి విజయ్ తన నిర్మాత అయిన చౌదరి భౌతికకాయాన్ని సందర్శించి అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్నా.. తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన నిర్మాతను చూసేందుకు అతడు వెంటనే తరలివచ్చారు. చౌదరి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన విజయ్ ఎమోషనల్ అయ్యి అక్కడే కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్‌బీ చౌదరి కుమారుడు, హీరో జీవాను చూడగానే విజయ్ ఆలింగనం చేసుకుని ఓదార్చిన తీరు అక్కడ ఉన్నవారిని కలచివేసింది. ఒక సోదరుడిలా జీవాకు ధైర్యం చెబుతూ విజయ్ చూపిన సాన్నిహిత్యం వారి మధ్య ఉన్న కుటుంబ అనుబంధాన్ని చాటిచెప్పింది.
విజయ్ కెరీర్ ఆరంభంలో `పూవే ఉనక్కాగా` వంటి విజయవంతమైన చిత్రంతో ఆర్‌బీ చౌదరి ఆయనకు పెద్ద బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత `లవ్ టుడే`, `తుళ్ళాద మనముమ్ తుళ్ళుమ్`, `షాజహాన్`, `తిరుపాచి`, `జిల్లా` వంటి వరుస హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్‌లోనే వచ్చాయి. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో చౌదరికి దశాబ్దాల కాలంగా ఉన్న స్నేహం.. ఇరు కుటుంబాల మధ్య బలమైన బంధాన్ని పెంచింది. విజయ్ విజయాల్లోనే కాదు.. అతడి సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించడంలోనూ చౌదరి ఎప్పుడూ ముందుండేవారు.
ఈ విషాద సమయంలో విజయ్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, తమిళ స్టార్ హీరోలు విక్రమ్, సూర్య, ధనుష్ , శివకార్తికేయన్ అక్కడకు తరలివచ్చి తమ సంతాపాన్ని ప్రకటించారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ఘనవిజయాలను అందుకున్న నిర్మాత కావడంతో ఈ మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ తో చౌదరికి ఉన్న అనుబంధం దృష్ట్యా ఇక్కడ హీరోలు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు కూడా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.
కేవలం వ్యాపారపరమైన లావాదేవీలకే పరిమితం కాకుండా.. ఒక నటుడిని తన కుటుంబ సభ్యుడిగా చూసుకునే గుణం ఆర్‌బీ చౌదరిది అని..అందుకే ఇంతమంది ప్రముఖులు భావోద్వేగంతో ఆయనకు చివరి వీడ్కోలు పలుకుతున్నారనడంలో సందేహం లేదు.
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బీ చౌదరి - విజయ్ కుటుంబాల మధ్య ఉన్న ఈ సుదీర్ఘ ప్రయాణం ఒక నిర్మాత-నటుడి సంబంధం ఎంత ఉత్తమంగా ఉంటుందో నిరూపిస్తోంది. విజయ్ నేడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నా.. తన మూలాలను మరిచిపోకుండా.. తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తులను మరువకపోవడం అతడి సంస్కారానికి నిదర్శనం. ఆర్.బి చౌదరి కుమారుడు హీరో జీవా - విజయ్ మధ్య ఉన్న సోదరభావం ఇండస్ట్రీలో ఆదర్శంగా నిలిచిపోయింది.