ఇరుముడి.. పాజిటివ్ దారిలో స్పీడ్ బ్రేకర్లు?

అయితే అదే ఈవెంట్ నుంచి సినిమాతో సంబంధం లేని రెండు మాటలు ఇప్పుడు ఎక్కువగా తిరుగుతున్నాయి.

Update: 2026-08-17 05:27 GMT

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులే ఉంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం సినిమాకు మంచి దారినే వేసింది. ముఖ్యంగా ట్రైలర్‌లో రవితేజను రెగ్యులర్ మాస్ క్యారెక్టర్‌కు దూరంగా తండ్రిగా చూపించడం, కూతురు సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప దీక్షను కథలో భాగం చేయడం ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచింది.

దీనికి తోడు ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ పాటను కూడా బయటకు తీసుకొచ్చారు. జి.వి.ప్రకాశ్ ఈ పాటకు పాత భక్తి టచ్‌ను అలాగే ఉంచే ప్రయత్నం చేశాడు. రిలీజ్‌కు ముందు చివరి నాలుగు రోజుల్లో ఈ పాట ఎంత వరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి. సినిమా ఫ్యామిలీ, ఎమోషన్ వైపు వెళ్తుందనే ఇమేజ్‌ను మరింత బలంగా తీసుకెళ్లడానికి టీమ్‌కు ఇదొక మంచి ఛాన్స్.

అయితే అదే ఈవెంట్ నుంచి సినిమాతో సంబంధం లేని రెండు మాటలు ఇప్పుడు ఎక్కువగా తిరుగుతున్నాయి. అజయ్ ఘోష్ రవితేజ గురించి మాట్లాడుతున్న సమయంలో ఉత్సాహంలో ఒక బూతు పదం జారిపోయింది. వెంటనే రవితేజ కూడా దానిపై సరదాగా స్పందించాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో చక్కర్లు కొట్టేసింది. గంటల పాటు జరిగిన ఈవెంట్‌లో సినిమా గురించి చెప్పిన విషయాల కంటే ఇలాంటి చిన్న వీడియోలకే ఎక్కువ రీచ్ రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు.

ఇంకో క్లిప్‌లో చిన్నారి నక్షత్రతో రవితేజ సరదాగా మాట్లాడిన విధానం మీద కూడా రెండు రకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆయనకు ఆ చిన్నారితో ఉన్న చనువు, సినిమాలో తండ్రీకూతుళ్లుగా ఏర్పడిన బాండింగ్‌ను చూసి ఆ మాటను పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు పబ్లిక్ స్టేజ్ మీద చిన్నారిని ఉద్దేశించి అలాంటి పదాలు అవసరమా అని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు.

ట్రైలర్‌తో వచ్చిన పాజిటివ్ టాక్, రవితేజ కొత్త క్యారెక్టర్, ఫ్యామిలీ ఎమోషన్ గురించి మాట్లాడాల్సిన టైమ్‌లో ఈ రెండు క్లిప్స్ పక్కదారి పట్టించాయి. అయితే సోషల్ మీడియా కాంట్రవర్సీ కనిపించిన ప్రతిసారీ అది సినిమా బాక్సాఫీస్‌ను ప్రభావితం చేస్తుందని కూడా చెప్పలేం. ‘ఇరుముడి’కి అసలు లెక్క థియేటర్‌లోనే తేలుతుంది. ఇప్పటివరకు కంటెంట్ వైపు వచ్చిన బజ్ సినిమాకు ప్లస్. ఈవెంట్‌లో వచ్చిన మాటలు చిన్న స్పీడ్ బ్రేకర్లుగా మారాయా, లేక రెండు రోజుల్లోనే సోషల్ మీడియా నుంచి మాయమైపోతాయా అన్నది చూడాలి.




Tags:    

Similar News