రణ్‌వీర్ సింగ్‌పై బాలీవుడ్ రాజకీయం?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్- సినీ కార్మిక సంఘం (FWICE) మధ్య న‌డుస్తోన్న `డాన్ 3` వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది.

Update: 2026-05-27 11:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్- సినీ కార్మిక సంఘం (FWICE) మధ్య న‌డుస్తోన్న `డాన్ 3` వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది. రణ్‌వీర్‌పై ఫెడరెషన్ విధించిన నాన్-కోఆపరేషన్ నిషేధం వెనుక పరిశ్రమ అంత ర్గత రాజకీయాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నం దుకు అగ్ర నటుడిని ఈ స్థాయిలో కార్నర్ చేయడం వెనుక బాలీవుడ్‌కు చెందిన పెద్ద శక్తుల ప్రమేయం ఉందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ చర్చకు సీనియర్ నటుడు చుంకీ పాండే ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.

గతంలో తనపై ఫెడరెషన్ చర్యలు తీసుకున్నప్పుడు అదే సమస్యలో ఉన్న అగ్ర నటులు ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హాలను మాత్రం సంఘం వదిలేసిందని చుంకీ గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో ఒకరిపై చర్యలు తీసుకునేటప్పుడు వారి హోదా, బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి నిబంధనలు మారిపోతాయనే విషయాన్ని ఆయన మాటలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే రణ్‌వీర్ సింగ్ విషయంలో కూడా కావాలనే అతిగా స్పందించ‌డంతో? రాజకీయం చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. `డాన్ 3` చిత్రం నుండి రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు 45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణ ఉంది.

అయితే నటీనటులు ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకోవడం లేదా డేట్స్ కుదరక మారడం పరిశ్రమలో సాధారణంగా జరిగేదే. అయినా? ఈ వివాదంలోకి కార్మిక సంఘాన్ని లాగడం, వారు వెంటనే స్పందించి రణ్‌వీర్ భవిష్యత్తు చిత్రాలను, ప్రకటనలను దెబ్బతీసేలా నిషేధం విధించడం వెనుక పక్కా ప్రణాళిక ఉందనే వాదనలు వినిపి స్తున్నాయి. కార్మిక సంఘాల పవర్‌ను కార్పొరేట్ సంస్థలు లేదా పెద్ద నిర్మాతలు తమ వ్యక్తిగత పంతాల కోసం వాడుకుంటున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. బాలీవుడ్‌లో క్యాంపులు, అంతర్గత సమూహాల రాజకీయం ఈనాటిది కాదు. రణ్‌వీర్ సింగ్ ఈ వివాదంలో ఫెడరెషన్ అధికార పరిధిని ప‌రోక్షంగా ప్రశ్నించడం సంఘం ప్రతినిధులకు నచ్చకపోవచ్చు.

కానీ గతంలో పెద్ద నటుల విషయంలో ఎంతో సామరస్యంగా వ్యవహరించిన సంఘాలు, రణ్‌వీర్ సింగ్ విషయంలో అంతటి దూకుడు ప్రదర్శించడం వెనుక ఆయ‌న్ని చిత్ర పరిశ్రమలో ఒంటరిని చేయాలనే వ్యూహం దాగి ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. సూపర్ స్టార్ల నిర్ణయాలు నచ్చనప్పుడు వారిని లొంగదీసుకోవడానికి యూనియన్ నియమాలను అస్త్రాలుగా వాడుతున్నారనే అనుమానాలు లేక‌పోలేదు. రణ్‌వీర్ సింగ్ ఈ వివాదంపై అధికారికంగా మౌనం వహించడం కూడా వ్యూహాత్మకమైనదే అనిపిస్తోంది. బహిరంగంగా మాట్లాడి వివాదాన్ని మరింత పెద్దది చేయడం కంటే చట్టపరంగా , అంతర్గతంగా పరిష్కరించుకోవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

కానీ పరిశ్రమలోని నాలుగు లక్షల మంది కార్మికులను ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారా రణ్‌వీర్ మార్కెట్ వాల్యూను, బ్రాండ్ ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం జరుగుతోందనేది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ మాట. ఏది ఏమైనప్పటికీ చుంకీ పాండే చెప్పిన పాత ఉదంతాన్ని బట్టి చూస్తే బాలీవుడ్‌లో నిబంధనల అమలు వెనుక ఎప్పుడూ ఒక రకమైన పక్షపాత వైఖరి , అంతర్గత రాజకీయం నడుస్తూనే ఉంటుందని అర్థమవుతోంది. రణ్‌వీర్ సింగ్ చుట్టూ ముసురుకున్న వివాదం కేవలం నటుడి నిబద్ధతకు సంబంధించినది మాత్రమే కాదు. పరిశ్రమలో అధికారం, పంతాలు ,కార్పొరేట్ ఒత్తిళ్ల మధ్య నడిచే ఘర్షణకు ప్రత్యక్ష ఉదాహరణ కూడా. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందో ? దీనికి ఎలాంటి ముగింపు ? దక్కుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News