రామాయణ ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్ ఎమోషనల్ స్పీచ్

పురాణేతిహాసం `రామాయ‌ణం` ఆధారంగా నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విజువల్ వండర్ `రామాయణ` చిత్రానికి సంబంధించిన `ప్రథమ సంకల్ప` ఈవెంట్ ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది.

Update: 2026-07-18 17:19 GMT

పురాణేతిహాసం `రామాయ‌ణం` ఆధారంగా నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విజువల్ వండర్ `రామాయణ` చిత్రానికి సంబంధించిన `ప్రథమ సంకల్ప` ఈవెంట్ ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ స‌హా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ వేదికపైకి రాగానే ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే అత‌డు వేదిక‌పై కూలింగ్ గ్లాసెస్ ధరించి రావడంతో అందరూ కాస్త ఆశ్చర్యపోయారు.

వేదికపై మైక్ అందుకున్న రణ్‌బీర్ కపూర్ భక్తిశ్రద్ధలతో ``జై శ్రీరామ్, జై సియారామ్`` అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం తాను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడంపై స్పందిస్తూ.. ``అందరికంటే ముందు నేను ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను.. ఈ నల్లటి అద్దాలు ధరించినందుకు మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాను. నా కళ్ళకు కొద్దిగా ఇన్‌ఫెక్షన్ అయ్యింది. కానీ ఈ శుభ సందర్భంలో నా గుండెల్లో మాత్రం మీ అందరిపై అపారమైన ప్రేమ మాత్రమే ఉంది..కాబట్టి దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు`` అని వినమ్రంగా క్లారిటీ ఇచ్చారు. కంటి ఇన్‌ఫెక్షన్ ఇతరులకు సోకకూడదనే బాధ్యతతోనే ఆయన గ్లాసెస్ ధరించారని తెలిసి అక్కడి వారంతా రణ్‌బీర్ సంస్కారాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా వేదికపై ఉన్న పాత తరం `రామాయణం` (రామానంద్ సాగర్ సీరియల్) లో శ్రీరాముడిగా నటించి దేశవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ వైపు రణ్‌బీర్ తిరిగి మాట్లాడారు. ఆయనను ఎంతో గౌరవంగా నిలబడమని కోరుతూ.. ``అందరికంటే ముందు నేను అరుణ్ జీతో మాట్లాడాలనుకుంటున్నాను. సార్... ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు ఈ శ్రీరాముడి పాత్ర బాధ్యతను ఇన్నేళ్లుగా ఎంతో అందంగా, నిజాయితీగా, ఎంతో హుందాతనంతో ప్రదర్శించారు. మీ ఈ ప్రయాణం కేవలం నా లాంటి నటుడికే కాదు... రామానంద్ సాగర్ గారి రామాయణం చూసిన ప్రతి ఒక్క మనిషికి ఒక నమ్మకాన్ని, గొప్ప ప్రేరణను ఇచ్చింది`` అంటూ ఎమోషనల్ అయ్యారు.

అరుణ్ గోవిల్ నటనను, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి. ``మీరు భగవాన్ శ్రీరాముడిని మీలోకి ఎలాగైతే ఆవాహన చేసుకున్నారో.. నేను మీ నటనలో..ఆ భక్తిలో కనీసం ఇంత (కొద్దిగా) చేయగలిగినా కూడా నా శ్రమ, నా కష్టం సఫలమైనట్లే. నా జన్మ ధన్యమైనట్లే సార్. చిన్నప్పటి నుండి భగవాన్ శ్రీరాముడి ఆశీస్సులు..ఆయన నేర్పిన పాఠాలు.. మీ ముఖాన్ని నా గుండెల్లో పెట్టుకుని పెరిగాను``అంటూ ఒక వీరాభిమానిలా రణ్‌బీర్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

చివరగా అరుణ్ గోవిల్కి కృతజ్ఞతలు తెలుపుతూ.. ``మేమందరం మిమ్మల్ని మా సొంత మనిషిలా ఎంతో ప్రేమిస్తున్నాం.. మీరు మాకు అందించిన ప్రతి దానికి థాంక్యూ వెరీ మచ్ సార్`` అంటూ రణ్‌బీర్ తన ప్రసంగాన్ని ముగించారు. రాముడి పాత్రను పోషిస్తున్న ఒక స్టార్ హీరో... ఒకప్పటి రాముడి పాత్రధారికి ఇచ్చిన ఈ గౌరవం .. ఆయన చూపిన వినయం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. రణ్‌బీర్ కపూర్ మాట్లాడిన ఈ ఎమోషనల్ స్పీచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Tags:    

Similar News