పాత సిద్ధాంతాలు చచ్చాయి.. వాటినే పట్టుకుంటే అంతమే: ఆర్జీవీ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. అయితే తాజాగా `దురంధర్ 2` చిత్రం చూసిన తర్వాత ఆయనలో కనిపిస్తున్న మార్పు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది.;
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. అయితే తాజాగా `దురంధర్ 2` చిత్రం చూసిన తర్వాత ఆయనలో కనిపిస్తున్న మార్పు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక దర్శకుడిగా తాను మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నట్లు వర్మ ప్రకటించడం ఆయనలోని పరివర్తనకు అద్దం పడుతోంది. పాత సినిమా సిద్ధాంతాలన్నీ 19 మార్చి 2026తో అంతమయ్యాయని.. వాటినే ఇంకా పట్టుకుంటే ఎవరైనా నాశనం అవ్వక తప్పదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
`దురంధర్` ఫ్రాంఛైజీ ఇచ్చిన స్ఫూర్తితో వర్మ తన తదుపరి చిత్రం `సిండికేట్`ను ప్రకటించారు. ఈ సినిమాను తన `గురువు`గా భావిస్తున్న ఆదిత్య ధర్‌కు అంకితం ఇచ్చారు. చనిపోయిన తనలోని దర్శకుడిని ఆదిత్య ధర్ మళ్ళీ బతికించాడని వర్మ భావిస్తున్నారు. అందుకే ఆదిత్య ధర్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌ను ఫాలో అవ్వడం ద్వారానే అప్‌డేటెడ్‌గా ఉండగలమని ఆయన తోటి దర్శకులకు, రచయితలకు సూచించారు. అహాన్ని పక్కన పెట్టి ఈ కొత్త తరహా మేకింగ్‌పై పరిశోధన చేయాలని ఆయన కోరారు.
వర్మ కొత్త సినిమా `సిండికేట్` కథాంశం కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇది భారతదేశ ఉనికికే ముప్పు తెచ్చే ఒక అత్యంత శక్తివంతమైన , క్రూరమైన సంస్థ గురించి సాగే కథ. ఇందులో ఎలాంటి దెయ్యాలు లేదా అతీంద్రియ శక్తులు ఉండవు. కానీ మనుషుల మెదడులో ఉండే భయంకరమైన ఆలోచనలు, వారు చేసే ఘోరాలు చూస్తే ఇది ఒక హారర్ సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుందని వర్మ వివరించారు. `దురంధర్ 2` తర్వాత మొదలైన కొత్త సినిమా యుగానికి ఈ చిత్రం సరైన ఆరంభం అవుతుందని ఆయన నమ్ముతున్నారు.
ఇంతకాలం తన సినిమాలకు హాలీవుడ్ క్లాసిక్ చిత్రాలే బెంచ్‌మార్క్ అని వర్మ నిజాయితీగా అంగీకరించారు. `రంగీలా`కు ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, `రాత్`కు ఎక్సార్సిస్ట్, `సత్య`, `సర్కార్` వంటి చిత్రాలకు గాడ్‌ఫాదర్ స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు `దురంధర్ 2` చూశాక తన పాత సినిమాలన్నీ ఏమాత్రం పనికిరానివిగా అనిపిస్తున్నాయని వర్మ వ్యాఖ్యానించారు. ఈ చిత్రం మేకింగ్, క్రాఫ్ట్, స్టోరీ టెల్లింగ్‌లో గాడ్‌ఫాదర్‌కే `గాడ్‌ఫాదర్` లాంటిదని ఆయన ఆకాశానికెత్తేశారు.
మొత్తానికి ఆదిత్య ధర్‌తో ఏర్పడిన ఆన్‌లైన్ స్నేహం వర్మను ఒక `మారిన మనిషి`గా మార్చేసింది. గతేడాది డిసెంబర్ నుంచి వీరిద్దరి మధ్య మొదలైన ఈ అనుబంధం ఇప్పుడు కొత్త తరహా సినిమాలకు బాటలు వేస్తోంది. ఇప్పటివరకు తాను నమ్మిన పాత సూత్రాలన్నింటినీ పక్కన పెట్టేసి, ఆధునిక మేకింగ్ శైలికి అనుగుణంగా తనను తాను మార్చుకోవాలని వర్మ తీసుకున్న నిర్ణయం ఆయనలోని కొత్త తపనను చాటిచెబుతోంది. ఈ క్రమంలో `సిండికేట్` సినిమాతో వర్మ మళ్ళీ తన పూర్వవైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి.